చేర్యాల(సిద్దిపేట): స్థానిక కోర్టు పరిధిలో అధిక సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నందున చేర్యాలకు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ను కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కోర్డులో ఆయనను చేర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెళ్ల వీరమల్లయ్య ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం చేర్యాల కోర్టు పరిధిలో 2,549 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అదనపు కోర్టు ఏర్పాటు చేస్తే కేసుల పరిష్కారానికి మరింత వెసులుబాటు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి న్యాయవాదులకు తగు సూచనలు చేసినట్లు తెలిపారు.


