● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశం ● పలు సమస్యలపై విస్తృతంగా చర్చ
దుబ్బాక: మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాక మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశం సోమవారం చైర్‌పర్సన్ శ్రీరాం సంగీత అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరధిలోని పలు సమస్యలపై సమగ్రంగా చర్చించారు. డబుల్ బెడ్రూం గృహాల కాలనీల్లో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పరిష్కరించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులతో పాటు ఐటీఐ కాలేజీకి వెళ్లే రోడ్డును అత్యవసరంగా అభివృద్ధి చేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కౌన్సిలర్లు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. వీధి కుక్కలపై ప్రత్యేక చర్యలు తీసుకొని, కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని, సిబ్బంది విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిబంధనల ప్రకారమే నియామకాలు ఉండాలన్నారు. పట్టణంలో తాగునీరు వృథాకాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ టెండర్ల విషయంలో ఎలాంటి రాజీపడొద్దని పక్కా నిబంధనల ప్రకారమే టెండర్లు వేయాలన్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఎఫ్‌ఎస్‌టీపీ నిర్వహణలో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోందని దీనిపై తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.


