రెండు విడతల్లో 230 మందికి శిక్షణ, సర్టిఫికెట్ల జారీ 120 మందికి మండలాలు కేటాయింపు
ఇప్పటికీ విధులు,బాధ్యతలపై కొరవడిన స్పష్టత
జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో 230 మందికి లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా సర్టిఫికెట్లను జారీ చేయగా మొదటి విడత వారికి మండలాలను కేటాయించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వేయర్లకు చేయడానికి పనిలేక, చేసిన పనికి వేతనం లేక విలవిల్లాడుతున్నారు. తమ విధులు, బాధ్యతలతో పాటు జీతభత్యాలు తెలపాలని సర్వేయర్లు కోరుతున్నారు.
భూ కొలతల్లో వీరి పాత్ర కీలకం
భూకొలతలు, హద్దులు నిర్ణయించడంలో సర్వేయర్ల పాత్ర కీలకం. భూభారతి చట్టం అమలులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళన కోసం ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. థియరీ, ప్రాక్టికల్, అప్రెంటీస్‌షిప్ తదితర అంశాల్లో సాంకేతిక సాయంతో భూ సర్వే నిర్వహణపై శిక్షణనిచ్చింది. అన్ని విభాగాల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను జారీ చేశారు. గతేడాది అక్టోబర్ 19న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నుంచి సర్టిఫికెట్లను అందజేశారు. రెండో విడత 110 మందికి ఫిబ్రవరి 28న కలెక్టర్ హైమావతి అందజేశారు. మొదటి విడత వారికి గతేడాది డిసెంబర్ 31న మండలాలు కేటాయించారు. దీంతో వారు తహసీల్దార్లకు రిపోర్ట్ చేశారు. రెండో విడత వారికి ఇంకా మండలాలు కేటాయించలేదు. రెండు నెలలుగా మొదటి విడతలో ఎంపికై నా లైసెన్స్‌డ్ సర్వేయర్లు పలువురు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి ఖాళీగా ఉండటం మినహా విధులు బాధ్యతలపై స్పష్టత లేదు.
రవాణా భారం
జిల్లాలో కొంత మంది సర్వేయర్లకు ఇతర మండలాల్లో విధులు కేటాయించారు. అసలే జీతం లేకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి కేటాయించిన మండలాలకు వెళ్లి వచ్చేందుకు రవాణా భారమవుతోంది. దీంతో పలువురు కార్యాలయాలకు వెళ్లడమే బంద్ చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విధివిధానాలు ప్రకటించి ఆర్థిక భరోసాను కల్పించాలని లైసెన్స్‌డ్ సర్వేయర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై సర్వే ల్యాండ్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌ను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వాటిని అమలు చేస్తాం.
మళ్లీ ఉపాధిని వెతుక్కుంటూ..
డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు భూ సర్వేపై ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తుందని, చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలను వదులుకొని శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణ పూర్తియినా విధుల పట్ల ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మళ్లీ ఉపాధి కోసం వెతుక్కుంటున్నారు. ఉన్న ఉద్యోగం వదిలేసి సర్వేయర్లుగా వచ్చిన వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి కొందరు సర్వేయర్లుగా విధులు నిర్వర్తించేందుకు సుముఖత చూపడంలేదని తెలుస్తోంది.
లైసెన్స్‌డ్ సర్వేయర్లు.. రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి విధులు, బాధ్యతలు కేటాయించకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. వీరికి 50 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ల జారీ చేసిన తర్వాత 75 రోజులకు మండలాలు కేటాయించారు. అయినా బాధ్యతలు అప్పగించకపోవడంతో ఖాళీగా ఉండటం గమనార్హం.
– సాక్షి, సిద్దిపేట
ఉపాధి లభిస్తుందని వస్తే..
ప్రభుత్వం ఉపాధి భరోసా కల్పిస్తుందన్న ఉద్దేశంతో సర్వేయర్లుగా శిక్షణ తీసుకున్నాం. శిక్షణ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం వృథా అయింది. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్లం. సర్వేయర్ ద్వారా ఉపాధి లభిస్తుందని వచ్చాం. ఇప్పటివరకు విధివిధానాలు ప్రకటించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.
– ప్రశాంత్‌కుమార్, అధ్యక్షుడు, జిల్లా లైసెన్స్‌డ్ సర్వేయర్స్ అసోసియేషన్


