● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 165
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందించిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ప్రజావాణికి వచ్చి అందిస్తున్న ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 165 దరఖాస్తులు వచ్చాయి.
అంతకుముందు జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని గురుకులాలు, హాస్టల్లో భోజనం, వసతి ఇతరత్రా విషయాలను పర్యవేక్షణ చేయడానికి జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగ రాజమ్మ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
ప్యాకేజీ అందించండి
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించాలని కోరారు. ఈ మేరకు ముంపు గ్రామమైన మామిడ్యాల వాసులు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ సమయంలో మా పుట్టినతేదీ వివరాలను తప్పుగా అధికారులు నమోదు చేశారన్నారు. దీంతో గత ప్రభుత్వం ప్యాకేజిని అందించలేదన్నారు. ఈ విషయమై ఎన్నో సార్లు కలెక్టర్కు, గజ్వేల్ ఆర్డీకు, తహసీల్దార్‌కు, అప్పటి నాయకులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఇటీవల ములుగు తహసీల్దార్ విచారణ చేపట్టి కలెక్టర్, ఆర్డీఓకు నివేదికను సమర్పించారన్నారు. ఇప్పటికై నా నష్టపోయిన మాకు కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు.


