హైవే గండం | - | Sakshi
Sakshi News home page

హైవే గండం

Nov 24 2026 11:18 AM | Updated on Nov 24 2026 11:18 AM

మోడల్‌ స్కూలుకు..
ఆటస్థలం మధ్యలోంచి జాతీయ రహదారి

కోహెడ మండలంలోని దాదాపు 20 గ్రామాలకు చెందిన సుమారు 700 నుంచి 800 మంది నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులు నాగసముద్రాలలోని మోడల్‌ పాఠశాలలో చదువుకుంటున్నారు. సర్వే నం.263లో ఐదెకరాల విస్తీర్ణంలో కాంపౌండ్‌ వాల్‌తో నిర్మించిన బడిలో కొత్త అలైన్‌మెంట్‌ ప్రకారం రోడ్డు వేస్తే సగ ప్రాంగణం, వాలీబాల్‌ కోర్టు ఆటస్థలం పూర్తిగా కనుమరుగవుతాయి. బడి మధ్యలోంచి నిత్యం భారీ వాహనాలు వెళ్తే విద్యార్థుల ప్రాణాలకు రక్షణేది? వాహనాల శబ్ధ, వాయు కాలుష్యంతో తరగతి గదుల్లో పాఠాలు వినే పరిస్థితి ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మూడుసార్లు సర్వే..

ఒక విద్యాసంస్థకు సంబంధించి ఇప్పటి వరకు మూడు సార్లు సర్వే నిర్వహించినా విద్యార్థులకు నష్టం కలిగించే విధంగానే అలైన్‌మెంట్‌ రూపొందించడం అనుమానాలకు తావిస్తోంది. గత ఏడాది మోడల్‌ స్కూల్‌ ఖాతాలో సుమారు రూ.62 లక్షలు జమ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అధికారులు బహిర్గతం చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విద్యాహక్కు చట్టం, జాతీయ రహదారుల నిర్మాణ మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాలలు, ఆస్పత్రులు ఉన్న చోట విద్యార్థుల భద్రతకు, విద్యా వాతావరణానికి విఘాతం కలగకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలి. అలాగే ఆటస్థలం లేకపోవడంతో విద్యార్థుల శారీరక దృఢత్వం క్రీడా ప్రతిభపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉన్నతాధికారులు, జాతీయ రహదారుల సంస్థ ఇంజనీర్లు తక్షణమే స్పందించి అలైన్‌మెంట్‌ మార్చాలని , విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని సర్వత్రా డిమాండ్‌ వినిపిస్తోంది.

ప్రైవేట్‌ వ్యక్తుల కోసమే అలైన్‌మెంట్‌ మార్చారా?

విద్యార్థుల భద్రత, భవిష్యత్తుకు ముప్పు

బడి ఖాతాలో రూ.62లక్షల జమపై అనుమానం

అభివృద్ధి పేరుతో రహదారి విస్తరణ వందలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చేప్పే బడి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. నాగసముద్రాల గ్రామంలోని మోడల్‌ స్కూల్‌ ప్రాంగణాన్ని రెండుగా చీలుస్తూ రూపొందించిన ఎన్‌హెచ్‌ –760 అలైన్‌మెంట్‌ విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారింది. రామాయంపేట – ఎల్కతుర్తి రహదారి నిర్మాణంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన మార్గాన్ని కాదని ఇప్పుడు నేరుగా పాఠశాల ఆటస్థలం మధ్యలోంచి రోడ్డు వేసేందుకు సిద్ధమవ్వడం కలకలం రేపుతోంది.

– కోహెడరూరల్‌(హుస్నాబాద్‌):

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement