చిన్నకోడూరు(సిద్దిపేట): తెలంగాణ సారస్వత పరిషత్తు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో మండల పరిధిలోని రామంచ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన హన్విక పాటల విభాగంలో తృతీయ, పద్య రచనలో బహుమతి, బ్లెస్సీ ద్వితీయ బహుమతి గెలుపొందారు. వీరిని పాఠశాల హెచ్‌ఎం సత్తవ్వ, ఉపాధ్యాయులు అబినందించారు.
పాపన్నపేట(మెదక్): అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్, ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ వివరాల ప్రకారం.. సోమవారం బొడ్మట్‌పల్లి వైపు నుంచి నార్సింగికి ఇసుక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ను, ఎంకెపల్లి శివారులోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే, కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
పుల్‌కల్(అందోల్): షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగి ఆభరణాలు, నగదుతోపాటు వస్తువులు కాలిపోయాయి. ఈ ఘటన మండల పరిధిలోని పోచారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కూనదొడ్డి మల్కయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలంటుకుని ఇంట్లో ఉన్న తులం బంగారం, 20తులాల వెండి, రూ.లక్ష నగదుతో పాటు సామగ్రి కాలి బూడిదైంది. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు పంచనామా చేసి వివరాలు సేకరించారు.
ఇద్దరికి గాయాలు
నర్సాపూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆటో హోటల్ సమీపంలో ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో ఆటో, బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఒకరికి తీవ్ర గాయాలవగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డితో ప్రస్తావించగా తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.
కొండపాక(గజ్వేల్): ద్విచక్ర వాహనం డీకొట్టడంతో వృద్ధురాలితోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని రాజీవ్ రహదారిపై దుద్దెడ క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండల పరిధిలోని రాంపల్లికి చెందిన వీరవ్వ (55) గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడకు వెళ్లి తిరుగు ప్రయాణంలో దుద్దెడ క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగింది. ఇంటికి తీసుకెళ్లేందుకు కొడుకు వస్తున్నాడని చెప్పడంతో రోడ్డు పక్కన నిలబడగా సిద్దిపేటకు చెందిన భార్యాభర్తలు యాదవ్వ, రాజయ్య ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొట్టారు. దీంతో వీరవ్వతో పాటు వారికి గాయాలయ్యాయి. వీరిని అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరవ్వ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
శివ్వంపేట(నర్సాపూర్): ట్రాక్టర్ ఇంజన్ నుంచి బ్యాటరీని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వివరాలు.. మండల పరిధిలోని కొంతన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు కంచన కృష్ణ ట్రాక్టర్‌ని పొలం వద్ద ఉంచాడు. సోమవారం వెళ్లి చూడగా ట్రాక్టర్ బ్యాటరీ కనిపించలేదు. దీంతో చోరీ చేసినట్లు గుర్తించాడు.


