సంగారెడ్డి ఎడ్యుకేషన్: జాతీయస్థాయి ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ పోటీల్లో జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అక్టోబర్ 12 నుంచి 14 వరకు నిర్వహించిన 12వ ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ జాతీయస్థాయి ప్రదర్శనలో జిల్లాకు చెందిన రెండు ప్రాజెక్టులు టాప్–60లో స్థానం సంపాదించాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 800 ప్రాజెక్టులు పోటీపడగా, తెలంగాణ నుంచి 52 ప్రాజెక్టులు పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాజెక్టులు ఎంపిక కాగా, వాటిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన రెండు ప్రాజెక్టులు ఉండటం విశేషం.
రాష్ట్రపతి భవన్లో ప్రదర్శనకు అవకాశం
విద్యార్థులు తమ ప్రాజెక్టుల పనితీరు, ఉపయోగాలను న్యాయనిర్ణేతలకు సమగ్రంగా వివరించారు. వారి ప్రదర్శనలను పరిశీలించిన న్యాయనిర్ణేతలు, అధికారులు, సందర్శకులు సంగారెడ్డి జిల్లా విద్యార్థులను అభినందించారు. జాతీయస్థాయిలో టాప్–60లో ఎంపికై న విద్యార్థులు త్వరలో రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించనుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చైర్మన్ అనిల్ జీ సహస్రబుద్ధే, డైరెక్టర్ అరవింద్ రానాడే తదితర ప్రముఖుల చేతుల మీదుగా విద్యార్థులు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ అడపాల వాణి, పద్మజ, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, జగిత్యాల జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో సంగారెడ్డి విద్యార్థుల సత్తా
ఇన్స్పైర్ ప్రాజెక్టుల్లో టాప్–60లో జిల్లాకు చెందిన రెండు ప్రాజెక్టులు
త్వరలో రాష్ట్రపతి భవన్లో ప్రదర్శనకు అవకాశం
అల్లర్లను నియంత్రించే ప్రత్యేక కవచం
పటాన్చెరులోని ఆరిజిన్ టెక్నో స్కూల్కు చెందిన చౌడపురం సాయి మేఘన మిరియాల స్ప్రే, కంటి చూపును తాత్కాలికంగా అడ్డుకునే ఎల్ఈడీ లైట్లతో కూడిన అల్లర్ల నిరోధక కవచానికి సంబంధించిన ప్రాజెక్టును ప్రదర్శించారు. ఈ వినూత్న ఆలోచన న్యాయనిర్ణేతలు, అధికారులు, సందర్శకుల ప్రశంసలు అందుకుంది.
దృష్టిలోపం ఉన్నవారికి ఏఐతో సాయం
భారతీయ విద్యాభవన్, బీహెచ్ఈఎల్కు చెందిన పూర్ణిత్రెడ్డి కృత్రిమ మేధస్సు(ఏఐ) సహాయంతో దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే ప్రాజెక్టును రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దృష్టిలోపం ఉన్నవారికి సహాయం చేయాలనే ఆలోచనతో రూపొందించిన ఈ ప్రాజెక్టు జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది.


