చేయూత పథకానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు జిల్లాల వారీగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. సుమారు నాలుగేళ్ల అనంతరం కొత్తగా పెన్షన్లు మంజూరుకు కసరత్తు చేయడంతో లబ్ధిదారులు ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 33,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సంగారెడ్డి 13,492, మెదక్ 10,411 సిద్దిపేటలో 9,741 మేర అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో సంగారెడ్డి జిల్లా 9వ స్థానంలో ఉంది. – సంగారెడ్డి జోన్
కొత్తగా మంజూరు చేసే పెన్షన్లలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు ప్రాధాన్యమిచ్చారు. అత్యధికంగా వితంతు మహిళలతోపాటు దివ్యాంగుల పెన్షన్లకు అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు గణా ంకాల ద్వారా తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరీల ద్వారా ప్రతీనెల 1,51,955 మంది లబ్ధిదారులకు రూ.33.43 కోట్ల మేర పెన్షన్లు అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016ల చొప్పున ప్రతీనెల అందజేస్తుంది.
అనర్హుల తొలగింపు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనర్హులు కూడా అక్రమంగా పెన్షన్ పొందుతుండటంతో వారిని గుర్తించి జాబితా నుంచి తొలగించారు. కొన్నేళ్లుగా 3,155 మంది అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్లు సర్వేలో తేలింది. 2022 ఆగస్టు 31 నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరు కాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది పథకానికి దూరంగా ఉన్నారు. చాలామంది కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణితో పాటు మండలస్థాయిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
ధ్రువపత్రాలు లేక ఇబ్బందులు
కొత్తగా మంజూరు చేస్తున్న పెన్షన్ల కోసం అర్హులై ఉన్నప్పటికీ సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు పొందేందుకు ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండటంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేటితో గడువు ముగియనుంది. https:// cheyutha. telengana. gov. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతోపాటు సంబంధిత పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత కార్యదర్శితోపాటు మండల పరిషత్ కార్యాలయాల్లో అందించాలి. వీరితోపాటు జిల్లాలో ఉన్న వృద్ధులు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంజూరులో వీరికి ప్రాధాన్యత లేకపోవటంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 33,644 అప్లికేషన్లు
పెన్షన్ దరఖాస్తుకు నేడు తుది గడువు
వితంతు, దివ్యాంగుల పెన్షన్ వారే అధికం
సర్టిఫికెట్లు లేక పలువురు ఇబ్బందులు


