వట్‌పల్లి(అందోల్): మండలంలో దాబా హోటళ్ల నిర్వాహకులు కాసుల కోసం యథేచ్ఛగా సిట్టింగులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాబాల్లో కేవలం భోజన సదుపాయం మాత్రమే కల్పించాలి. కానీ మద్యం సిట్టింగులు నిర్వహిస్తున్నారు. అధికారులు పట్టించకోకపోవడంతో వారి వ్యాపారం మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులుగా వర్ధిల్లుతోంది. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయని చెబుతున్న అధికారులే నిలువరించలేకపోతున్నారని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన వట్‌పల్లిలో మెటల్‌కుంటకు వెళ్లే రహదారి పక్కనే మూడు దాబా హోటళ్లు ఏర్పాటు చేశారు. మద్యం విక్రయాలు, సిట్టింగులకు అనుమతి లేకపోయినా ఏర్పాటు చేశారు. మందుబాబులకు హోటళ్ల నిర్వాహకులు మద్యం బాటిళ్లను తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల సమన్వయంతోనే సిట్టింగ్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే హడావిడి చేసే అధికారులు వీటిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎకై ్సజ్ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా... దాబాల్లో మద్యం విక్రయించడం, తాగడం నిషిద్ధమని, ఎవరైనా దాబాల్లో మద్యం సిట్టింగులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వట్‌పల్లిలో గల దాబా హోటళ్లలో మద్యం సిట్టింగులకు ఎటువంటి అనుమతులు లేవని తనిఖీలు చేసి బాధిత హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
బార్లను తలపిస్తున్న వైనం
పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు


