రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. | - | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

Mar 29 2026 8:56 AM | Updated on Mar 29 2026 8:56 AM

ఇద్దరికి స్వల్ప గాయాలు

పటాన్‌చెరు టౌన్‌: జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనగా.. ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన పటాన్‌చెరు పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇస్నాపూర్‌ శివారు సాంఘీక సంక్షేమ వసతి గృహం మలుపు వద్ద కంటోన్మెంట్‌ డిపోకు చెందిన బస్సును యాదగిరిగుట్టకు వెళ్తున్న సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సులో ఉన్న ఇద్దరికి గాయాలు కాగా, కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించడంతో ట్రాఫిక్‌ సీఐ లాలూ నాయక్‌, పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

రైల్వే స్టేషన్‌ తనిఖీ

రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను శనివారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, ఇతర వసతులపై సమీక్షించారు. పలు అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డా.ఆర్‌.గోపాలకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజీయే రాజమార్గం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

సాయిరమాదేవి

సిద్దిపేటకమాన్‌: లోక్‌ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని సిద్దిపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో న్యాయమూర్తులు రాజీ ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ..జాతీయ లోక్‌ అదాలత్‌లో 5,353 క్రిమినల్‌, 20 సివిల్‌, 11 మోటారు వాహన ప్రమాదం, 70 బ్యాంకు కేసులతో పాటు మొత్తం 5,454 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద కేసుల్లో రూ.92.26లక్షలు, బ్యాంకు పీఎల్‌సీ కేసుల్లో 30.32 లక్షలు పరిష్కరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్‌, సంతోష్‌కుమార్‌, సాధన,తరుణి, సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్‌, లక్ష్మీబాబు, సైదా, న్యాయవాదులు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం

మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి

కల్హేర్‌(నారాయణఖేడ్‌): రోడ్డు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సిర్గాపూర్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నారాయణఖేడ్‌ నుంచి సిర్గాపూర్‌, మాసాన్‌పల్లి రోడ్డు నిర్మాణం పనుల కోసం తవ్వి అసంపూర్తిగా వదిలేశారని మండిపడ్డారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు రోషన్‌రెడ్డి, సంజీవరావు, మాధవరావు పాటిల్‌, మాజీ సర్పంచ్‌లు సంజీవరెడ్డి, బసిరెడ్డి, విజయ్‌కమార్‌, రవీందర్‌రావు, బాలజీ పాల్గొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

సంగారెడ్డి క్రైమ్‌: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న ఉదయం 11 గంటల సమయంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని బ్లడ్‌ బ్యాంకు వద్ద గుర్తుతెలియని వ్యక్తి(55), అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్‌ గమనించి అత్యవసర వార్డుకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. సెక్యూరిటీ గార్డ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అతడు ప్రభుత్వ ఆస్పత్రి ఆవర ణలో గల దుకాణాల్లో భిక్షాటన చేసే వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వయసు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని, వివరాలు తెలిస్తే 87126 56718 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement