మిరుదొడ్డి(దుబ్బాక): ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్‌లో చోటు చేసుకుంది. శనివారం ఎస్‌ఐ హరీశ్ తెలిపిన కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఆరుగొండ నాగార్జున (35) స్థానికంగా పంచర్ షాపు నిర్వహిస్తూ భార్య మల్లిక, కూతురును పోషిస్తున్నాడు. ఈ నెల 27న పంచర్ షాపునకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అప్పుడప్పుడు నాగార్జున రాత్రి ఫూట షాపులోనే నిద్రపోయేవాడు. అదే రోజు కూడా అక్కడే పడుకోవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. శనివారం తెల్లవారు జామున నాగార్జున కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం గ్రామ శివారులోని పెద్ద చెరువులో అతడి మృతదేహం గ్రామస్తులకు కనిపించింది. కాగా నాగార్జున ప్రతి రోజు కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు దగ్గరకు వెళ్లేవాడని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో పడి వ్యక్తి మృతి


