పాపన్నపేట(మెదక్): రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీల్లో పాపన్నపేట ఉన్నత పాఠశాలకు చెందిన కరెల్ల వైష్ణవి విజేతగా నిలిచారు. ఆదివారం హన్మకొండలో జరిగిన వేడుకలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, నగదు, మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. వైష్ణవి విజేతగా నిలవడంపై పాఠశాల హెచ్‌ఎం మహేశ్వర్, తెలుగు ఉపాధ్యాయులు అంజాగౌడ్, నాగరాజు, నర్సింహులు అభినందనలు తెలిపారు.
క్షేమంగా వచ్చిన వృద్ధులు
పోలీసులకు కృతజ్ఞతలు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని జంగరాయి గ్రామంలో బంగారం దోపిడీకి పాల్పడిన దుండగుడి దాడిలో తీవ్రగాయాలకు గురై చికిత్స పొందిన తమ్మల అంజయ్య, సావిత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఆదివారం విషయం తెలుసుకున్న సర్పంచ్ ఆవుల గోపాల్‌రెడ్డితో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వారి ఇంటికి చేరుకొని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి సర్పంచ్ మాట్లాడుతూ.. 48 గంటల్లోనే దుండగుడిని పట్టుకొని, బంగారం రికవరీ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధికారుల నుంచి చిన్నశంకరంపేట మండల పోలీస్ అధికారుల వరకు వేగంగా స్పందించిన తీరు తమకు మరింత ధైర్యం కల్పించిందన్నారు. త్వరలోనే గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ
అట్రాసిటీ కేసు
మద్దూరు(హుస్నాబాద్): గ్రామ పంచాయతీ కారోబార్‌ను కులం పేరుతో దూషించి, దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటన మండలంలోని లద్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహ్మద్ ఆసీఫ్ వివరాల ప్రకారం... గ్రామంలో కారోబార్‌గా పని చేస్తున్న మల్లారపు రమేశ్ శనివారం గ్రామంలోని కొత్త గుడిసెల కాలనీ లో నీరు పెట్టడానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కాసర్ల రమేశ్, కాసర్ల ప్రశాంత్ అతడి వద్దకు వెళ్లి మా వదినతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ కులం పేరుతో దూషిస్తూ కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కారోబార్‌ను కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధితుడి కుమారుడు గిరీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
రామాయణం
జీవన మార్గదర్శి
సిద్దిపేటకమాన్: రామాయణం మనకు జీవన మార్గదర్శిని అని కవి రఘువీర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఉత్సాహ రామాయణం, శ్రీ వశిష్ట గీతామృతం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్దిపేట సాహిత్యానికి ఎంతో ప్రోత్సాహకం ఇస్తుందన్నారు. ఎంతో మంది కవులు తమ సాహిత్యాన్ని ప్రజల హితంగా రాస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బాలయ్య, వెంకటేశ్వర్లు, సతీశ్, నాగలత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


