590 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రద్దు..? | - | Sakshi
Sakshi News home page

590 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రద్దు..?

Mar 29 2026 8:55 AM | Updated on Mar 29 2026 8:55 AM

● ఈ గృహాల్లో నివాసముందడటం లేదని గుర్తింపు ● కొందరు అద్దెకు ఇచ్చినట్లు అధికారుల దృష్టికి.. ● రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చిన అధికారులు

● ఈ గృహాల్లో నివాసముందడటం లేదని గుర్తింపు ● కొందరు అద్దెకు ఇచ్చినట్లు అధికారుల దృష్టికి.. ● రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చిన అధికారులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో లబ్ధిదారులకు కేటాయించిన సుమారు 590 డబుల్‌ బెడ్‌రూం గృహాలను రద్దు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆయా లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ గృహాలను తీసుకున్నప్పటికీ ఆ లబ్ధిదారులు అందులో నివాసం ఉండటం లేదని, చాలా మటుకు తాళాలు వేసి ఖాళీగా ఉంచారని గుర్తించారు. అలాగే కొందరు లబ్ధిదారులు వీటిలో నివాసం ఉండకుండా ఇతరులకు అద్దెకు ఉంటున్నట్లు తేలింది. దీంతో వీటిని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు పొందిన లబ్ధిదారుల వివరణను బట్టి రద్దుపై ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. రద్దు అయ్యే అవకాశాలున్న ఈ డబుల్‌బెడ్‌రూం గృహాల్లో అత్యధికంగా పటాన్‌చెరు నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం.

వివిధ కారణాలతో నివాసముండని లబ్ధిదారులు

గత ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం గృహాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన విషయం విదితమే. అయితే ఇందులో భాగంగా కొల్లూరు–1లో 2,050 గృహాలు, కొల్లూరు –2లో 16,500 గృహాలను నిర్మించారు. భారీ టౌన్‌షిప్‌లోని గృహాలను గతంలో లాటరీ పద్ధతి ద్వారా అర్హులైన లబ్దిదారులకు గృహాలను కేటాయించారు. అయితే వివిధ కారణాలతో ఈ గృహాల్లో చాలా మంది నివాసం ఉండటం లేదు. ప్రధానంగా అక్కడ మౌళిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో ఈ గృహాల్లో ఉండటం లేదు. అలాగే హైదరాబాద్‌ నగరానికి దూరంగా ఉన్నాయి. దీంతో చిన్నాచితక ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు, కూలీ పనులకు వెళ్లే వారు నిత్యం కొల్లూరుకు వచ్చి వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. అలాగే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు కూడా సమయానికి లేకపోవడంతో కొందరు అర్హులైన లబ్దిదారులు రాకపోకలు ఇబ్బందికి గురై ఈ గృహాల్లో ఉండటం లేదు. కొందరు అద్దెకు ఇచ్చారు. ఇలా నివాసముండని, అద్దెకు ఇచ్చిన ఇండ్లను రద్దు చేసి, అర్హులైన లబ్దిదారులకు కేటాయించాలని భావిస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో విచారణ

ఈ డబుల్‌బెడ్‌రూం గృహాల్లో కేటాయించిన లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా? లేదా.? గుర్తించేందుకు విచారణ చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారుల బృందాలను నియమించారు. ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇలా నివాసముండని ఇండ్లు, అద్దెకు ఇచ్చిన ఇండ్లను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. అయితే సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే నివాస ముంటామని లబ్ధిదారులు వాపోతున్నారు. నిరుపేదలమైన తమకు ఇచ్చిన రద్దు చేయవద్దని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement