గజ్వేల్‌రూరల్: తల్లి మందలించిందని యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని బీడీ కాలనీలో నివాసముండే స్పందన ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటుందని ఈనెల 24న తల్లి మందలించింది. దీంతో ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. మరుసటి రోజు 25న ఫోన్‌లో తన స్నేహితురాలితో మాట్లాడిన తర్వాత స్విచ్ఛాఫ్ చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసు విధులకు
ఆటంకం.. అరెస్టు
చేగుంట(తూప్రాన్): విధులకు ఆటంకం కల్గించి, భౌతిక దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి రైల్వేగేటు సమీపంలో రాంగ్ రూట్‌లో మెదక్ వైపు నుంచి వచ్చిన కారు రైల్వే గేటు వద్ద అడ్డుగా నిలుపడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఉండటంతో సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో తూప్రాన్ పట్టణానికి చెందిన కారు డ్రైవర్ ఎరువ విజయ్‌కృష్ణ కానిస్టేబుల్‌పై దుర్బాషలాడుతూ చేయి చేసుకున్నాడు. అతడి స్నేహితులు పవన్, వంజరి బాలాజీ బ్లూకోట్స్ కానిస్టేబుల్ ట్యాబ్‌ను నేలకు కొట్టి ధ్వంసం చేశారు. దీంతో ముగ్గురి నిందితులపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.
ప్రభుత్వ భూమి చదును
వ్యక్తిపై కేసు నమోదు
జోగిపేట(అందోల్): ప్రభుత్వ భూముల కబ్జాలకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని అందోలు ఇన్‌చార్జి తహసీల్దార్ మధుకర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన కమిషనర్ రవీందర్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందోలు శివారులోని శ్రీరంగనాథ స్వామి ఆలయ సమీపంలోని ప్రభుత్వానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు చదును చేస్తున్న పనులను అధికారులు అడ్డుకున్నారు. పనులు చేయిస్తున్న ఎర్ర శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి, జేసీబీని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను ఎవ్వరూ కబ్జా చేసేందుకు ప్రయత్నించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని రవాణా చేసినా ఊరుకునేది లేదన్నారు.
మందుబాబులకు జరిమానా
సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమానా విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల ప్రకారం... శుక్రవారం అర్ధరాత్రి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద, బైపాస్‌లోని గుర్రపుబొమ్మ, పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని శనివారం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి ఇద్దరికి రూ. 1500, మిగతా ఎనిమిది మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.


