కూతురి అల్లుడే నిందితుడు | - | Sakshi
Sakshi News home page

కూతురి అల్లుడే నిందితుడు

Mar 29 2026 8:56 AM | Updated on Mar 29 2026 8:56 AM

మెదక్‌జోన్‌: వృద్ధ దంపతులపై దాడి చేసి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగారాయి గ్రామానికి చెందిన తమ్మల సావిత్రి, అంజయ్య దంపతులకు ఐదుగురు సంతానం. కాగా వారి పెద్ద కూతురు కృష్ణవేణి తన కూతురును కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాసన్‌పల్లి గ్రామానికి చెందిన వరిగే వెంకట నారాయణకు ఇచ్చి పెళ్లి చేసింది. ప్రస్తుతం వీరు తూప్రాన్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఏ పని చేయకుండా వెంకట నారాయణ జులాయిగా తిరుగుతున్నాడు. కాగా ఈ నెల 25న అతడు జంగారాయికి వచ్చాడు. ఈ క్రమంలో వృద్ధ దంపతుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై అతడి కన్ను పడింది. దీంతో ఎవరు గుర్తుపట్టకుండా ముఖానికి మాస్కు ధరించి ఇనుప రాడ్‌తో వృద్ధ దంపతుల తల పగులగొట్టి 4.5 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. కాగా శనివారం తూప్రాన్‌ బస్టాండ్‌లో వెంకట నారాయణ అనుమానాస్పదంగా కనిపించటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే దాడిచేసి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి ఆభరణాలతో పాటు ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసును ఛాలెంజ్‌గా తీసుకొని మూడు రోజుల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ శ్రీనివాసరావు జ్ఞాపికలు, నగదు రివార్డుతో సత్కరించాడు.

ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణం

రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవర్ల నిర్లక్షమేనని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నా రు. అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించి ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఫోన్‌ వినియోగం వంటి కారణాల వల్లే జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రాత్రి వేళల్లో డ్రైవర్ల చూపు సమస్యల కారణంగా సైతం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. అందుకోసం డ్రైవర్లలో చూపు సమస్యలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. అలాగే పట్టణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ప్రారంభించారు.

వృద్ధ దంపతులపై దాడి..

ఆభరణాల చోరీ కేసులో అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement