39 గోల్డ్ , 26 సిల్వర్ మెడల్స్ సొంతం
దుబ్బాక/మిరుదొడ్డి(దుబ్బాక): జాతీయస్థాయి కరాటే పోటీల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 65 మంది విద్యార్థులు ప్రతిభ చాటి 39 గోల్డ్ మెడల్స్, 26 సిల్వర్ మెడల్స్ సాధించారు. కిక్కెర్స్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో 3వ జాతీయస్థాయి మార్షల్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువస్పోర్ట్స్ కరాటే అకాడమి తెలంగాణ వ్యవస్థాపకుడు బురాని శ్రీకాంత్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన విద్యార్థులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ కరాటే పోటీలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 2 వేలకు పైగా విద్యార్థులు పాల్గొనగా దుబ్బాక మండలం రామక్కపేట గురుకులానికి చెందిన బాలికలు 20 గోల్డ్, 22 సిల్వర్ , లచ్చపేట మాడల్ స్కూల్ విద్యార్థులు మూడు గోల్డ్ , 1 సిల్వర్, దుబ్బాక కేజీవీబీ మూడు గోల్డ్, 1 సిల్వర్, సిద్దిపేట స్ప్రింగ్ డయల్ స్కూల్ 1 గోల్డ్ , దిశ స్కూల్ 1 సిల్వర్, మాస్టర్ మైండ్స్ స్కూల్ 4 గోల్డ్ , 1 సిల్వర్ , మిరుదొడ్డి కేజీవీబీ బాలికల పాఠశాల విద్యార్థులు 8 గోల్డ్ మెడల్స్ సాధించారు. ప్రతిభ చాటి జిల్లాకు పేరు తెచ్చిన విద్యార్థులను డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, డీసీడీఓ నర్మద, డీసీఓ శారద, ప్రిన్సిపాల్ బుచ్చిబాబు అభినందించారు.


