వికలాంగుల సంఘం జిల్లా కార్యదర్శి యశోద
టేక్మాల్(మెదక్): వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి యశోద అన్నారు. సోమవారం మండలంలోని కాద్లూర్ గ్రామంలో నిర్వహించిన వికలాంగుల సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ వికలాంగులకు రూ. 6వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. పింఛన్‌తోపాటు చేయూత పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో వికలాంగులకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి, సభ్యులు చంద్రమ్మ, కేశమ్మ, ఎల్లమ్మ, రమేశ్, మల్లయ్య, కిష్టయ్య, చిన్న నవీన్ పాల్గొన్నారు.


