టర్న్‌కీ అంటే..
విద్యుత్‌శాఖలో ‘టర్న్‌కీ’ స్వస్తి
● ఇకపై సంస్థ ద్వారానే విద్యుత్ లైన్ల పనులు ● ట్రాన్స్‌ఫార్మార్లు, ప్యానెల్ బోర్డుల పనులు సైతం.. ● టీజీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్‌శాఖలో ఎలక్ట్రికల్ పనుల ఎగ్జిక్యూషన్ విషయంలో టీజీఎస్పీడీసీఎల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న టర్న్‌కీ పద్ధతికి ఇకపై స్వస్తి చెప్పా లని అనుకుంటుంది. తద్వారా మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకే సంస్థ సేవలందించడానికి వీలు కలుగుతోందని భావిస్తోంది. దీనికి తోడు ఈ శాఖలోని కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి చేస్తున్న విచ్చలవిడి దోపిడీకి కూడా చాలా మటుకు చెక్ పడుతుందని భావిస్తోంది.
టర్న్‌కీ విధానానికి స్వస్తి చెప్పి నేరుగా సంస్థ ద్వారానే పనులు చేయించాలని భావిస్తోంది. ఈ విధానంలో విద్యుత్ లైన్లు లేని చోట్ల విద్యుత్ కనెక్షన్ పొందాలంటే కొత్తగా ఏర్పాటు చేయనున్న లైన్ నిర్మాణానికి అయ్యే అంచనా వ్యయాన్ని మొత్తం (100 శాతం) సంస్థకే వినియోగదారుడు జమ చేయాలి. ఎస్పీడీసీఎల్ అధికారులు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తుంది. పనిచేసిన కాంట్రాక్టరుకు వినియోగదారుడు కాకుండా సంస్థ నే బిల్లులు చెల్లిస్తుంది. ఈ విధానం అమలు కోసం చర్యలు చేపట్టామని, కొన్ని మార్గదర్శకాలు రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాలో అన్ని కేటగిరిలు కలిపి 8.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. ఇందులో సుమారు 6.24 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 1.06 వ్యవసాయ కనెక్షన్లు, 77 వేల వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు, 17 వేలకు పైగా ఇతర కేటగిరీల కనెక్షన్లు ఉన్నాయి. కొత్త కనెక్షన్లు, ప్యానల్ బోర్డులు ఇలా వివిధ రకాల పనుల కోసం ప్రతినెలా సుమారు 3 వేల దరఖాస్తులు వస్తుంటాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి విద్యుత్ లైన్లు నిర్మించడం వంటి పనులు చేస్తుంటారు.
కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి దోపిడీ
కొందరు ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు ఈ టర్న్‌కీ విధానం కాసుల వర్షం కురిపిస్తోంది. వినియోగదారుల జేబులకు మాత్రం పెద్ద ఎత్తున చిల్లు పడుతోంది. ఉదహరణకు చిన్న కుటీర పరిశ్రమకు విద్యుత్ కనెక్షన్ కోసం రూ.లక్ష ఖర్చు అయ్యే పనికి కొందరు అధికారులు ఈ అంచనాను రూ.రెండు, మూడు లక్షలకు పెంచుతున్నారు. ఇందులో పది శాతం మొత్తాన్ని ఎస్పీడీసీఎల్ సంస్థకు చెల్లించి మిగిలిన 90 శాతం డబ్బులతో సగం కూడా ఖర్చు చేయకుండానే పని చేయించి అందిన కాడికి దండుకోవడం పరిపాటైందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యుత్ పనులపై అంతగా అవగాహన లేని సాధారణ వినియోగదారులు అధికారులు అడిగినంత ఇచ్చే పనులు చేయించుకుంటున్నారు. ఒకవేళ టర్న్‌కీ విధానం వద్దనుకుంటే కనెక్షన్ ఇచ్చేందుకు వినియోగదారులను నెలల తరబడి చెప్పులరిగేలా తిప్పించుకోవడంతో పరిపాటై పోయిందనే విమర్శలు ఉన్నాయి. కొందరు ఇంజనీరింగ్ అధికారులైతే ఏకంగా బినామీ పేర్లతో కాంట్రాక్టర్ అవతారమెత్తారు. దీంతో వారి దోపిడీకి అడ్డే లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. కొత్త విధానంతో ఎంత మేరకు వినియోగదారులకు సేవలందుతాయనేది వేచి చూడాల్సిందే.
వినియోగదారులు విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నా.. ఏదైనా అపార్టుమెంట్‌కు ట్రాన్స్‌ఫార్మర్ బిగించాలన్నా.. ఏదైనా పరిశ్రమకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే కొత్తగా వేయాల్సిన విద్యుత్ లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు (ఎస్టిమేషన్)లో 10 శాతం మొత్తాన్ని ఎస్పీడీసీఎల్‌కు చెల్లించాలి. తమ సొంత ఖర్చులతో పోల్స్, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసి లైసెన్స్ ఉన్న కాంట్రాక్టరుతో పనులు చేయించుకోవచ్చు. ఈ పనులు పూర్తయ్యాక విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా ఇస్తారు. దీన్ని టర్న్‌కీ విధానం అంటారు.


