గ్రేటర్ ఉప కమిషనర్ జ్యోతిరెడ్డి
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో పారిశుద్ధ్య నిర్వహణపై ఐలా (ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆఫ్ లోకల్ అథారిటీ)కి ముందు సమాచారం ఇచ్చాక జరిమాన విధించాలని గ్రేటర్ ఉప కమిషనర్ జ్యోతి రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు డివిజన్‌లో అధికారులతో కలిసి సోమవారం పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. డంపింగ్ యార్డు నిర్వహణకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ప్రతీ దుకాణం నుంచి తడి పొడి చెత్త వేసేందుకు బుట్టలు ఉండేలా చూడాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరూ ఒకే చోట పని చేయకుండా అన్ని ప్రాంతాల్లో శుభ్రం చేయాలని సూచించారు.
డిగ్రీ కళాశాలలో
రంగోలి పోటీలు
జోగిపేట(అందోల్): స్థానిక నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సైన్‌న్స్‌డే వారోత్సవాల్లో భాగంగా సోమవారం విద్యార్థినులకు రంగోలి (రంగవల్లి) కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు వివిధ రకాల రంగులతో అందంగా వేశారు. ఈ సందర్భంగా వృక్షశాస్త్ర విభాగ అధిపతి ఆర్.స్వర్ణలత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు దారితీస్తుందన్నారు. వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకురాలు డాక్టర్. శైలజ మాట్లాడుతూ.. రంగవల్లులు విద్యార్థులకు పరీక్షల నిమిత్తం సబ్జెక్టు పరంగా చక్కగా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు వేసిన రంగవల్లులకు అధ్యాపకులు బహుమతులు ప్రదానం చేశారు.
మా మనోభావాలను
దెబ్బ తీయొద్దు
పీఆర్‌టీయూ గౌరవ అధ్యక్షుడు తులసీరాం
జహీరాబాద్ టౌన్: పాఠశాలల సమస్యలకు పరిష్కారాలను ప్రస్తావించకుండా విద్యావ్యవస్థపై నివేదిక తయారు చేయడం హాస్యాస్పదమని, ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని పీఆర్‌టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు తులసీరాం రాథోడ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సంబంధించిన సిఫార్సులు చాలా అభ్యంతకరకంగా ఉన్నాయన్నారు. వేతనాలు తగ్గించడం, అప్రెంటిస్ విధానం అమలు చేయడం వంటి ఏ మాత్రం సమర్ధనీయం కాదన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను చదువుకు దూరంగా పెట్టే విధంగా ఉందని వాపోయారు. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నివేదిక అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని కోరారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ నాయకులు శ్రీనివాస్, వరాలు, నర్సయ్య, ప్రదీప్ కుమార్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ రైతుకు సత్కారం
జహీరాబాద్: వ్యవసాయంలో మంచి దిగుబడులను సాధిస్తున్న రైతు నాగేశ్వర్‌రెడ్డిని ఉత్తమ రైతుగా ఎంపిక చేసి సత్కరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతుకు వందనం కార్యక్రమంలో పది మంది రైతులను వికాసతరంగిణి వ్యవస్థాపకులు చిన జీయర్‌స్వామి చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా సాయి అలేఖ్య ఆర్ట్స్ ఆధ్వర్యంలో జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ రైతులు నల్ల నాగేశ్వర్‌రెడ్డిని సత్కరించారు. సత్కారం పొందడం సంతోషంగా ఉందని రైతు నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.


