● నిమ్జ్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం
సంగారెడ్డి జోన్: జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పరిధిలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిమ్జ్ మొదటి దశలో సేకరించిన భూముల సరిహద్దుల గుర్తింపు, ఫెన్సింగ్ పనులు, సమీప రహదారుల అభివృద్ధి, నిమ్జ్‌కు అనుసంధానించే ముఖ్య మార్గాల విస్తరణ వంటి అంశాలపై పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్మార్ట్ ఇండియా సిటీలో భాగంగా మౌలిక వసతులు కల్పించేందుకు ఎస్‌ఆర్‌అర్ కంపెనీకి అప్పగించామన్నారు. లే అవుట్ అభివృద్ధి చేసేందుకు వీలుగా పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు సేకరించిన భూముల్లో హద్దురాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాళ్లను తొలగిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్‌లు మాధురి, పాండు, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తదితరులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోండి
గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే సర్పంచ్‌లకు అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. పట్టణంలోని మహిళా ప్రాంగణంలో సర్పంచ్‌లకు (నాలుగు మండలాలకు చెందిన 4వ బ్యాచ్) నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి సోమవారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేర్చుకున్న విషయాలను గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించాలని, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను మార్చి 31లోగా పూర్తిచేయాలని కోరారు. అనంతరం మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లలిత కుమారి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ప్రజావాణికి 56 వినతులు
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజవాణిలో 56 వినతులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమహారతి తదితరులు పాల్గొన్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు
వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పట్టణంలోని డే కేర్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. కేంద్రంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.


