
సేవే లక్ష్యం.. అవగాహనే ముఖ్యం
మర్కూక్(గజ్వేల్): గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందని, ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చేలా తమ వంతు కృషి చేస్తున్నారు. సేవే లక్ష్యంగా స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు. గ్రామంలోని వీధుల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్, మురుగు నీరు, ప్రజలకు రోగాలు ఏ విధంగా వస్తున్నాయని అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తయారు చేయాలనే లక్ష్యంతో 60 మంది విద్యార్థినులు గ్రూపులుగా విడిపోయి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని మాజీ సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో హైదరాబాద్‌లోని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల విద్యార్థినులు సుమారు 15 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మూడు రోజుల నుండి ఎర్రవల్లి గ్రామంలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామంలో రోడ్లపై మురుగునీరు పారుతుండటంతో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు సోకే ప్రమాదం ఉందని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్త్ క్యాంపు నిర్వహించి రక్త పరీక్ష, హిమోగ్లోబిన్, బీపీ, షుగర్ వాటికి వెంటనే మందులు ఇస్తున్నారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లను తొలగిస్తున్నారు. మూడు రోజులుగా గ్రామ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్నారని మాజీ సర్పంచ్ భాగ్య తెలిపారు.వ్యాధులపై అవగాహన
ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. రోగాల భారిన పడకుండా ఉండేందుకు తమ వంతు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. వారికి అవగాహన కల్పించేలా స్వయంగా తామే పరిసరాలను శుభ్రం చేశాం. ప్రత్యేకంగా డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించాం. – ప్రియా, విద్యార్థిని
ప్రజలతో మమేకమై..
నేను బేగంపేట మహిళా కళాశాలలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపులో పాల్గొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది. గ్రామాల్లోకి వచ్చి ప్రజలతో మమేకమై చాలా విషయాలు తెలుసుకున్నా. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతా. – నిక్షిత, విద్యార్థిని
వ్యాధులు సోకకుండా జాగ్ర త్తలు
గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాం. హెల్త్ క్యాంపు నిర్వహించి రక్త నమూనాలను సేకరించి వెంటనే మందులు పంపిణీ చేశాం. డెంగీ సోకకుండా జాగ్రత్తలు సూచించాం. ప్రజల సహకారం అభినందనీయం.
– డాక్టర్ ప్రసన్న (ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్)
ఎర్రవల్లిలో ప్లాస్టిక్‌ను సేకరిస్తున్న విద్యార్థులు
పల్లె సేవలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థినులు