
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
సీఆర్‌ఐఎఫ్ ద్వారా రూ.20కోట్లు మంజూరు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి
నారాయణఖేడ్: నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ రిజర్వు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ (సీఆర్‌ఐఎఫ్) నిధులు రూ.20కోట్లతో ఎన్‌హెచ్ 161బీ అనుసంధానంతో మూడుగుంటల చౌరస్తా నుంచి వయా సంజీవన్‌రావుపేట్, కడ్పల్, సిర్గాపూర్, చాప్టా(కె) క్రాస్‌రోడ్డు వరకు రహదారి అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు చెప్పారు.
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృషితో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఈ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు అనుసంధానిస్తూ నాలుగు రోడ్లను, హ్యామ్‌కింద రూ.300 కోట్లతో రహదారులకోసం ప్రతిపాదించినట్లు తెలిపారు. బోర్గి, చౌకాన్‌పల్లి, కంగ్టి, ఖేడ్, రాయిపల్లి బీటీ రెన్యూవల్‌కు కూడా ప్రతిపాదించామని వెల్లడించారు.
రూ.5కోట్లతో ఎన్‌జీ హుక్రాన రహదారి నిర్మాణం, వాసర్, కరస్‌గుత్తి ఎరక్‌పల్లికి రూ.5కోట్లు, రూప్లా తండా నుంచి లచ్చు తండాకు రూ.4.50కోట్లతో రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎస్టీ హ్యాబిటేషన్ కింద కొండానాయక్ తండా రూ.2.20కోట్లు, ఎకరన్‌పల్లి నుంచి హనుమాన్ తండాకు రూ.1.10 కోట్లు, లక్యానాయక్ తండాకు రూ.1.75కోట్లతో రహదారులను బీటీ రెన్యూవల్ చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యాదవరెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.