
త్వరలో చెరువుల సుందరీకరణ
కంది(సంగారెడ్డి): హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) నిధులతో చెరువుల సుందరీకరణ చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. కంది చుట్టుపక్కల దేవుని చెరువు, కిసాన్‌సాగర్ చెరువు, పాత చెరువును టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి సందర్శించారు. చెరువుల వద్ద చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం మెట్లతోపాటు గణేశ్ నిమజ్జనం కోసం గద్దెలు నిర్మించాలన్నారు. చెరువుల చుట్టూ నెక్లెస్ రోడ్లను నిర్మించి పచ్చదనం ఏర్పాటుచేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. భూములను ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే పరిహారం చెల్లించి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ బాలగణేశ్ పాల్గొన్నారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి