
అరు్హలందరికీ సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి జోన్: ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేవిధంగా చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రితో పాటు కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి నివాళులర్పించారు. అనంతరం మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ..నేటి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తుందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రెట్టింపు ఉత్సాహంతో కలిసికట్టుగా శ్రమించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
14,538 మంది లబ్ధిదారులకు ఇళ్లు
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారిని గుర్తించి, వారు నిర్మించుకునేందుకు జిల్లాలో 14,538 మంది దరఖాస్తుదారులకు ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 7,429 పనులు ప్రారంభం కాగా, 239 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.46కోట్లు లబ్ధిదారులకు చెల్లించడం జరిగిందని వివరించారు.విద్య, వైద్యానికి ప్రాధాన్యత
జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 59 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించుకుంటున్నామని, అందుకు రూ. రూ.1.80 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రూ.186 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల భవనాన్ని ఇటీవలే ప్రారంభించామని, రూ.273 కోట్ల నిధులతో సంగారెడ్డిలో 500 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి వెల్లడించారు.
దేశాభివృద్ధిలో శిల్పుల పాత్ర కీలకం
నేటి సమాజంలో శిల్పులు, కార్మికులు, వృత్తిదారులు సాంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.
ఆహార భద్రత పథకం ద్వారా సన్నబియ్యం
ప్రజా పాలన వేడుకల్లోమంత్రి దామోదర
అమరవీరుల స్తూపం వద్ద నివాళులు
కలెక్టరేట్‌లో ఆకట్టుకున్నసాంస్కృతిక కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకం ద్వారా ప్రతీనెల ఉచితంగా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 846 రేషన్ దుకాణాల ద్వారా 13, 3719 మంది సభ్యులకు 3,736 క్వింటాళ్ల బియ్యం ప్రతీనెల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 4,10,652 తెల్ల రేషన్ కార్డులు, 26,078 అంత్యోదయ, 100 అన్నపూర్ణ కార్డులున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.