
ముంపు బారిన మంజీరా తీరం
పుల్‌కల్(అందోల్): భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో మంజీరా నది తీరం వెంబడి పంటలు మునిగిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మంజీరానది పరీవాహకం సారవంతమైన నేల కావడంతో పంటలు బాగా పండుతాయని ఆశించిన రైతులను వరదలు దిక్కుతోచని స్థితిలోకి నెట్టాయి. ప్రాజెక్టుకు భారీ వరదలు రావడంతో క్రస్టుగేట్ల ద్వారా నీటిని వదలడం...ఆ నీరు మంజీరా బ్యారేజ్ గుండా దిగువకు సరాసరి పోకపోవడంతో మంజీరా నది ప్రవాహం వెంబడి నీరు నిలిచిపోయి పంటలు మునిగిపోయాయి.
ప్రతీ ఏటా ఇదే పరిస్థితి
సింగూరు ప్రాజెక్టు దిగువ నుంచి మంజీరా బ్యారేజ్ వరకు 22 కిలోమీటర్ల మంజీరా నది పరివాహకం ఇరువైపులా వరదల వల్ల పంటలు ముంపు బారిన పడుతున్నాయి. వరదలు వచ్చిన ప్రతి ఏటా పంటలు మునిగి పోవడం ఇక్కడ సాధారణమైపోయింది. పుల్‌కల్,సదాశివపేట,మునిపల్లి తదితర మండలాల పరిధిలోని మంజీరా నది పరీవాహకం రైతులకు కండగండ్లు మిగులుతున్నాయి.
ప్రభుత్వం ఆదుకోవాలి..
మంజీరా నది పరీవాహకంలో వరదల వల్ల ఏటా పంటలు మునిగిపోతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజ్ వరకు ఉన్న భూముల్లో వరదల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి.
– కమాల్‌రెడ్డి రైతు, ముద్దాయిపేట
ఏటా మునుగుతున్న పంటలు
నష్టపోతున్న రైతులు