
రజాకార్లకు ఎదురొడ్డిన బైరాన్‌పల్లి
మద్దూరు(హుస్నాబాద్): నిజాం రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బైరాన్‌పల్లి అమరవీరులదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా వీర బైరాన్‌పల్లి గ్రామంలోని అమవీరుల స్తూపం, బురుజు వద్ద భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైజన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అర్ధరాత్రి నెత్తురు పారిన నేల బైరాన్‌పల్లి అని పేర్కొన్నారు. రజాకార్ల ఆగడాలను అడ్డుకుంటూ , వారి మూకలను తరిమిగొట్టిన గొప్ప చరిత్ర ఈనేలకు ఉందన్నారు. 1948 ఆగస్టు 27న రజాకార్లు గ్రామంలోకి ప్రవేశించి కాల్చి చంపి , ఇంటింటికీ తిరిగి మారణకాండ సృష్టించి మరో జలియన్‌వాలా బాగ్‌ను సృష్టించారన్నారు. గ్రామం బయట శవాల చుట్టూ మహిళలను వివస్త్రలు చేసి బతుకమ్మ ఆటలు ఆడించిన ఘటనను గుర్తు చేసుకుంటే బాధేస్తుందన్నారు. ఈ ప్రాంతం స్ఫూర్తితో వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు, సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సీఎంతో మాట్లాడి బైరాన్‌పల్లి అమరవీరుల స్మారకం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటూ వారిని గౌరవించుకుంటామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
బైరాన్‌పల్లి అభివృద్ధికి కృషి: ఎంపీ చామల
మనందరం ఈరోజు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామంటే బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాల వల్లేనని అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గ్రామానికి వీర బైరాన్‌పల్లిగా పేరు మార్చుకోడానికి గెజిట్ తీసుకువస్తామని, స్తూపం, బురుజు నిర్మాణం కోసం రూ. 10లక్షల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని గత ప్రభుత్వం పదేళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, టీపీసీసీ కార్యదర్శి గిరి కొండల్‌రెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కమలాకర్ యాదవ్, బైరాన్‌పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
గ్రామంలో స్మారక స్తూపం నిర్మిస్తాం