
కొండెంగలను పట్టుకుంటాం
జహీరాబాద్: పట్టణంలో ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్న కొండెంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నట్లు డీఎఫ్‌ఓ సి.శ్రీధర్‌రావు పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షి’ మెయిన్‌లో ‘కొండెంగల వీరంగం’, 20 మందికి గాయాలు శీర్షికన ప్రచురితమైన కథనానికి ఫారెస్టు, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు స్పందించారు. పట్టణంలోని శాంతినగర్, బాగారెడ్డిపల్లి, హౌసింగ్‌బోర్డు, హమాలీ కాలనీల్లో కొండెంగల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. ఆయా కాలనీల ప్రజలు వాటి నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి విన్నవించారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ప్రజలు కోరారు. కాగా డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్‌రావుతో సంప్రదింపులు జరిపారు. కొండెంగలను పట్టుకునేందుకు నిపుణుల బృందాన్ని రప్పించేందుకు ఏర్పాట్లు చేశామని, మహబూబ్‌నగర్ నుంచి పిలిపిస్తున్నట్లు చెప్పారు. గురువారం ఉదయం పట్టుకుంటారని తెలిపారు. బాధితులకు తగిన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మరో ఇద్దరిపై దాడి ..
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మరో ఇద్దరిపై కొండముచ్చులు దాడి చేసి బుధవారం గాయపరిచాయి. శాంతినగర్‌కు చెందిన మారుతీరావు, సిద్ధులు వీధిలో వెళ్తుంటే రెండు కొండు ముచ్చులు వారిపై ఆకస్మికంగా దాడి చేశాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. జాగో తెలంగాణ నాయకులు రాములు నేత, శివప్రసాద్, ఎండీ ఇమ్రాన్ తదితరులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా అధికారులు వచ్చి గాయపడిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. వీరికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నాం
జిల్లా ఫారెస్టు అధికారి శ్రీధర్‌రావు
‘సాక్షి’ కథనానికి స్పందన