
చికిత్స పొందుతూ తల్లి మృతి
గజ్వేల్‌రూరల్: విద్యుదాఘాతానికి గురై మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన మండలంలోని కొడకండ్లలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మిందె గౌరయ్య–మనిలా(38) దంపతులకు కూతురు రేణ, కొడుకు విష్ణు ఉన్నారు. వీరికి ఇంటితో పాటు ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. గౌరయ్య 4 ఏళ్ల క్రితం అనారోగ్యానికి గురై మృతి చెందడంతో పిల్లల బాధ్యత మనీలాపై పడింది. దీంతో ఆమె గజ్వేల్‌లోని ఓ హోటల్‌లో కూలీ పనులు చేస్తూ పిల్లలను సాకుతుంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం హోటల్‌లో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. నాలుగేళ్ల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. గ్రామస్తులు, బంధువుల సహకారంతో చందాలు వేసి బుధవారం మనీలా అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు పిల్లలను మానవతావాదులు, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
అనాథలుగా మారిన చిన్నారులు