
వేధింపులతో నవవధువు ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... బుడగజంగాల కాలనీకి చెందిన తల్లితండ్రులు లేని ఊబిది అలియాస్ రాధిక(19)ని నెల రోజుల క్రితం ఇదే కాలనీకి చెందిన వానరాసి కుమార్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన వారం రోజుల నుంచే భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో కుల పెద్దలను ఆశ్రయించడంతో భార్యాభర్తలకు నచ్చజెప్పారు. అయినా భర్త తీరు మార్చుకోకపోవడంతో పాటు భౌతికదాడికి దిగడంతో రెండు రోజుల క్రితం అత్తింటి నుంచి తల్లిగారి ఇంటికి వచ్చింది. రెండు రోజులుగా మానసిక ఆందోళనకు గురైన యువతి జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధుృవీకరించారు.
అదే ఇంట్లో.. నలుగురు..
కాగా.. క్షణికావేశం, జీవితంపై అవగాహన లేకపోవడంతో ఐదేళ్లలో బుడగజంగాల కాలనీలోని ఆ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఊబిది యాదగిరి, యాదమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు అయ్యాయి. ఆరేళ్ల క్రితం తండ్రి యాదగిరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇది జరిగిన ఏడాదికి మరో కూతురు పూజ(15), గత ఏడాది అక్టోబర్‌లో తల్లి యాదమ్మ(40), ఆరు నెలల క్రితం పెద్ద కుమారుడు శ్రీనివాస్, తాజాగా చిన్న కూతురు రాధిక కూడా ఇదే ఇంట్లో ఉరివేసుకున్నారు.
అప్పుల బాధతో రైతు..
శివ్వంపేట(నర్సాపూర్): అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని పోతులబోగూడ గ్రామానికి చెందిన నర్సింలు గౌడ్ (45) వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ ఫామ్‌తో జీవనోపాధి పొందుతున్నాడు. సంవత్సరం క్రితం నూతనంగా ఇంటి నిర్మాణంతో పాటు కోళ్ల ఫామ్ షెడ్ వేశాడు. వీటికి రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులిచ్చిన ప్రైవేటు బ్యాంకు, ఇతరుల నుంచి ఒత్తిడి పెరగడంతో తీర్చలేక మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న నర్సింలుగౌడ్‌ని చికిత్స నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుండి సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
అనారోగ్యంతో ఆటో డ్రైవర్..
జగదేవ్‌పూర్(గజ్వేల్): అనారోగ్యంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణారెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్(36) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో పాటు ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వేధింపులతో నవవధువు ఆత్మహత్య