
మహబూబ్‌సాగర్ సుందరీకరణ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ద్వారా రూ.500 కోట్ల అంచనా వ్యయంతో మహబూబ్‌సాగర్ సుందరీకరణ పనులు చేపడుతామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రజలతో పాటు, హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు, ఆర్డినెన్స్‌ఫ్యాక్టరీ ఉద్యోగులకు ఆహ్లాదాన్ని పంచేలా దీన్ని ఓ టూరిజం స్పాట్‌గా, రిక్రియేషన్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులతో కలిసి మహబూబ్‌సాగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సాగర్ మధ్యలో ఉన్న సోమేశ్వరాలయం అభివృద్ధితోపాటు, మహాశివుడి విగ్రహం ఏర్పాటు చేసి కేబుల్ బ్రిడ్జితో అనుసంధానించేంలా డిజైన్‌లు రూపొందించారని చెప్పారు. ఐఐటీహెచ్‌ను అనుసంధానించేలా మహబూబ్‌సాగర్ నుంచి వంద ఫీట్ల వెడల్పుతో రహదారిని నిర్మిస్తామన్నారు. పట్టణంలోని మురుగునీరు మహబూబ్‌సాగర్‌లోకి చేరకుండా 23.5 కే.ఎల్. సామర్థ్యంతో సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, సైకిల్ ట్రాక్, వాచ్‌టవర్, బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా నిర్మాణం వంటివి సుందరీకరణ పనుల్లో ఉంటాయని ఆయన వివరించారు. ఈ సందర్బంగా హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు సుందరీకరణ పనుల్లోని వివిధ కాంపోనెంట్ల అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.