
ఊరురా తల్లి పాల వారోత్సవాలు
న్యాల్‌కల్(జహీరాబాద్): తల్లి పాల ప్రాముఖ్యతపై సరైన అవగాహన లేకపోవడం, కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లులు తమ పిల్లలకు తల్లి పాలను సక్రమంగా అందించడం లేదు. ఫలితంగా పిల్లలకు సరైన పోషకాలు అందక వ్యాధుల బారిన పడుతున్నారు. వారి ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులోభాగంగా ఈ ఏడాది కూడా తల్లి పాల వారోత్సవాలను ప్రారంభించింది. గత రెండు రోజులుగా ఊరురా తల్లి పాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి.
జిల్లాలో 1,504 అంగన్‌వాడి కేంద్రాలు
జిల్లాలో 1,504 అంగన్‌వాడి కేంద్రాలున్నాయి. 1,432 మంది అంగన్‌వాడి కార్యకర్తలు పని చేస్తున్నారు. ఆయా కేంద్రాల పరిధిలో 19,405 మంది గర్భిణులు, బాలింతలు ఉండగా, 1,02,724 మంది చిన్నారులున్నారు. వీరందరికి అంగన్‌వాడి కార్యకర్తలు పౌష్టికాహారం అందిస్తున్నారు. పౌష్టికాహారంతోపాటు తల్లి పాల ప్రాముఖ్యతను వివరిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం తల్లి పాల వారోత్సలపై ఊరురా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో తల్లిదండ్రులతోపాటు ఆశ వర్కర్లు, స్వయం సహాయ సంఘాల సభ్యులు, వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారులను భాగస్వామ్యం చేసింది. వీరంతా గ్రామాల్లో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో తల్లి పాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. బిడ్డ పుట్టగానే గంటలోపు తల్లి పాలను బిడ్డకు పట్టించాలని, 6 నెలల వరకు తల్లి పాలను అందించాలని, తల్లి పాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు అందుతాయని, చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు అవగాహన కల్పిస్తున్నారు.
తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
తల్లి పాలపై అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలోని అన్ని గ్రామాల్లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. బిడ్డ పుట్టిన గంటలోపు పాలిచ్చే తల్లులు 34% ఉండగా, 6నెలలలోపు పాలిచ్చే తల్లులు 65% ఉన్నారు. తల్లులకు అవగాహన కల్పించి పిల్లందరికీ 6 నెలల లోపు తల్లిపాలను తప్పకుండా అందించేలా కృషి చేస్తున్నాం.
– లలితాకుమారి, జిల్లా సంక్షేమాధికారి,సంగారెడ్డి

ఊరురా తల్లి పాల వారోత్సవాలు