
కనీస వేతనాలు అమలు చేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు
కంది(సంగారెడ్డి): గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000లు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రమైన కంది గ్రామపంచాయతీ వద్ద శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ..గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో ఇచ్చిన వేతనాలను కూడా తగ్గించి ఇవ్వడం దారుణమన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మల్లేశ్, వీరరాజు, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
రీసెర్చ్ స్కాలర్ అర్షద్ హుస్సేన్‌కు డాక్టరేట్
పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, లైఫ్ సైన్సెస్ విభాగం ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో పరిశోధక విద్యార్థి అర్ష్షద్ హుస్సేన్ మాలిక్ డాక్టరేట్ లభించింది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర ప్రాంతంలో తుపాను, ఉప్పెన వంటి సహజ ప్రమాదాల అంచనాకు రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) అనువర్తనాలను ఉపయోగించడం’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రంధి ఉమాదేవి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘బనకచర్ల’పై ఆరోపణలు
అర్థరహితం
మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి
వట్‌పల్లి(అందోల్): బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలు అర్థరహితమని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి పేర్కొన్నారు. జోగిపేటలో జరిగిన కాంగ్రెస్ సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను మఠం తీవ్రంగా ఖండించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి బీడు వారిన భూములను సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.
అన్‌ట్రైన్డ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
డీఈఓ వెంకటేశ్వర్లును కోరిన
టీబెస్ నాయకులు
జహీరాబాద్ టౌన్: అన్‌ట్రైన్డ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బంజార ఎంప్లాయిస్ సేవా సంఘం(టీబెస్) నాయకులు డీఈఓ వెంకటేశ్వర్లను కోరారు. ఈమేరకు శనివారం ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీబెస్ రాష్ట్ర అధ్యక్షుడు పీపీరాథోడ్, ప్రధాన కార్యదర్శి తులసీరాం రాథోడ్‌లు మాట్లాడుతూ అన్‌ట్రైన్డ్ డీఎస్‌సీ ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. డీఎస్‌సీల వారీగా సీనియారిటీ జాబితా రూపొందించి ప్రమోషన్‌లు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు దేవీసింగ్, మంజునాయక్ తదితరులున్నారు.

కనీస వేతనాలు అమలు చేయాలి