
అదే అలసత్వం
భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం
● ఐదుగురు తహసీల్దార్లకుషోకాజ్ నోటీసులు
● బడాబాబులు, రియల్టర్లు, దళారుల పనులు మాత్రం చకచక
● విమర్శలకు దారితీస్తున్న కొందరు రెవెన్యూ అధికారుల పనితీరు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కొందరు రెవెన్యూ అధికారుల పనితీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రధానంగా భూసమస్యల పరిష్కారంలో తమ అలసత్వం వీడటం లేదు. ధరణి పోర్టల్ స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో కొందరు తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులకు గతంలో ఉన్న ధరణి కష్టాలే ఇప్పుడూ కొనసాగుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. 26 మండలాల పరిధిలో ఉన్న 604 రెవెన్యూ గ్రామాల్లో ఈ సదస్సులు జరిగాయి. ఆయా గ్రామాల్లో భూసమస్యలకు సంబంధించి మొత్తం 13,897 ధరఖాస్తులు వచ్చాయి. ఈ సదస్సులు పూర్తయి దాదాపు రెండు నెలలు దాటినప్పటికీ, ఇందులో కేవలం 1,030 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా సుమారు 12,867 దరఖాస్తులకు అతీగతీ లేదు. రోజువారీగా ఎన్ని దరఖాస్తులను పరిష్కరిస్తున్నారనే అంశంపై ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నారు. కొందరు తహసీల్దార్లు ఒక రోజులో కనీసం ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించడం లేదు. బడాబాబులు, రియలర్టు, రాజకీయ నేతలు, దళారుల భూ వ్యవహరాలను మాత్రం చకచక చేస్తున్నారు. నిరుపేద రైతులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారానికి మాత్రం చేతులు రావడం లేదు.
ఐదుగురికి శ్రీముఖాలు
భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్న ఐదుగురు తహసీల్దార్లకు కలెక్టర్ ప్రా వీణ్య షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఆశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు ఎన్ని పర్యాయాలు చెప్పినా తమ తీరు మార్చుకోకపోవడంతో ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిష్కారం ప్రగతిపై ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సమీక్షల్లో సదరు అధికారులను హెచ్చరించినప్పటికీ., తీరు మార్చుకోకపోవడంతో నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సాకులు చెబుతూ.. దాటవేస్తూ..
భూభారతి అమలు తీరుపై నిర్వహించే సమీక్షల్లో నిర్లక్ష్యం చేస్తున్న ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే.. కొందరు సాకులు చెబుతున్నారు. రైతులే స్పందించడం లేదని, మ్యూటేషన్, సక్సేషన్ వంటి దరఖాస్తులకు సంబంధించిన ఫీజును రైతులు చెల్లించడం లేదని చెప్పుకొస్తున్నారు. కొన్నింటికి సర్వే అవసరమని సాకు చెబుతున్నారు. అవసరం ఉన్నా.. లేకపోయిన సర్వే సాకు చెబుతుండటంతో భూ సమస్య నెలల తరబడి పెండింగ్‌లో పడిపోతోంది. భూముల సర్వే చేయాలంటే చాలా సమ యం పడుతుండటంతో అధికారులు ఈసాకును వెతుకుతున్నారని తెలుస్తోంది.
పరిష్కరిస్తే మాకేంటీ..?
జిల్లాలో కొందరు తహసీల్దార్లు అక్రమార్జనకు మరిగారు. విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతంలో పరోక్షంగా సహకరించి కోట్లకు పడగలెత్తారు. అసైన్డ్ భూములకు నిరభ్యంతర పత్రాలు జారీకి అనుకూలమైన రిపోర్టులు ఇచ్చి అందిన కాడికి దండుకున్నారు. రియల్టర్లు, దళారుల ద్వారా వచ్చిన భూసమస్యలు పరిష్కరిస్తే పెద్ద మొత్తంలో కాసుల వర్షం కురుస్తుంది. అదే ఇప్పుడు ఈ భూభారతి ధరఖాస్తులను పరిష్కరిస్తే ఒరిగేదేమీ ఉండదు. దీంతో వీరు భూభారతి ధరఖాస్తుల పరిష్కారానికి ఆసక్తి చూపడం లేదు.