
రసాభాసగా చెక్కుల పంపిణీ కార్యక్రమం
హత్నూర(సంగారెడ్డి): మండల కేంద్రమైన హత్నూ ర రైతు వేదికలో శనివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతుండగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసేందుకు పెద్ద ఎత్తున నినాదాలతో సమావేశ మందిరంలోకి ఒక్కసారిగా వచ్చారు. దీంతో వెంటనే అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడానికి యత్నించగా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రం పటం చినిగిపోయింది. దీంతో కాంగ్రెస్ నాయకులు మరింత రెచ్చిపోయి పెద్ద ఎత్తున సునీతారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నాయకులకు నచ్చజెప్పినా వినకపోవడంతో వారందరినీ బయటకు లాక్కెళ్లారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ చేరుకుని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని చించేసిన బీఆర్‌ఎస్ నాయకులపై ఫిర్యాదు చేయగా...బీఆర్‌ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా
ప్రజల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌ను, మంత్రులను కూడా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అంతేకాకుండా తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను కావడంతో ఇక్కడ అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. నియోజకవర్గంలో తాను చేపట్టే ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయాలలో అధికార పార్టీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తుండటం సరికాదన్నారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన 187 రేషన్ కార్డులు 40 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని సమయం వచ్చినప్పుడు చూస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ ఫర్హీన్ షేక్, ఎంపీడీవో శంకర్, డిప్యూటీ తహసీల్దార్ దావూద్ హరిబాబు, లబ్ధిదారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ
అభివృద్ధి కోసం రాజకీయాలుపక్కన పెడతాః ఎమ్మెల్యే సునీతారెడ్డి
సీఎం ఫొటో చించిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీసీసీ అధ్యక్షుడు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని చించివేసిన దుండగులను వెంటనే శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి డిమాండ్ చేశారు.