
కార్మికులకు అండగా లేబర్‌కార్డు
జిల్లాలో 25వేల మంది కార్మికులు
మెదక్ కలెక్టరేట్: అసంఘటిత కార్మికులకు లేబర్‌కార్డు అండగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వ్యవసాయ ఆధారం లేకపోవడంతో పట్టణాలకు చేరుకుని భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ సరైన కూలీ గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు పట్టణంలోని పేదలు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే ప్రమాదవశాత్తు పనిచేస్తున్న చోట జరగరానిది జరిగి కాలు, చేయి విరగడం, ప్రాణాలుపోతే అతడిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కార్మికుల కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలబడి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లేబర్‌కార్డును అందజేస్తుంది.
25 వేల మంది కార్మికులు
జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట మూడు అసిస్టెంట్ లేబర్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులు 25వేలు మంది ఉండగా, 87,607 మంది ఈ–శ్రమ్‌కార్డులు పొంది ఉన్నారు. అందులో 67,316 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు.
పెళ్లికి, డెలివరీలకు..
అసంఘటిత రంగ కార్మికుడు కూతురు పెళ్లికి రూ.30 వేలు, డెలివరీకి రూ.30 వేల చొప్పున రూ.60 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే అసంఘటిత కార్మికురాలి పెళ్లి కానుకగా రూ.30 వేలు, ఒక్కో డెలివరీ కానుకగా రూ.30 వేల చొప్పున రెండు డెలీవరీలకు రూ.60 వేలు ప్రభుత్వం అందజేస్తుంది.
రూ.6.50 కోట్లు
భవన నిర్మాణ కార్మికులు రోడ్డు ప్రమాదంలో గాని, పనిచేసే చోట ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు, సాధారణ మరణం సంభవిస్తే రూ.1.30 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు కార్మికుల పెళ్లిళ్లకు, డెలివరీలకు, ప్రమాదంలో గాయపడిన వారికి, మరణించిన వారికి మొత్తం రూ.6.50 కోట్లు ప్రభుత్వం అందజేసింది.
ఒక్క ఏడాదిలో 256 వరకు..
డెలివరీ బెనిఫిట్స్ 175
మ్యారేజ్ కానుకలు 68
సాధారణ మరణాలు 9
యాక్సిడెంటల్ మరణాలు 4
87,607 మందికి ఈ– శ్రమ్‌కార్డులు 67,316 మంది వ్యవసాయ కార్మికులు
రూ.110 కొండంత అండ
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కేవలం రూ.110 చెల్లించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో లేబర్‌కార్డు లభిస్తుంది. అడ్డా కూలీలు, భవన నిర్మాణ కూలీలకు ఈ కార్డు ఆపద సమయంలో కొండంత అండగా నిలుస్తుంది. కూలీలు చేసే పనులన్నీ ప్రమాదాలతో కూడినవే. నిర్మాణ పనులు చేసే సమయంలో ఏదైన ప్రమాదానికి గురైతే ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. ప్రమాదవశాత్తు కాళ్లు, చేతులు విరగడంతో పాటు ఏదైనా తీవ్ర గాయం జరిగితే ప్రమాద తీవ్రతను బట్టి సుమారు రూ.3 లక్షల వరకు అందజేస్తుంది.
ప్రాసెసింగ్‌లో 50 దరఖాస్తులు
జిల్లాలో ప్రస్తుతం మరో 50 వరకు దరఖాస్తులు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పెళ్లిళ్లు, డెలీవరీలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే కార్మికుల అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం.
– సత్యేంద్రనాథ్,
జిల్లా కార్మికశాఖ ఇన్‌చార్జి

కార్మికులకు అండగా లేబర్‌కార్డు