
జోరుగా మట్టి దందా?
అక్రమంగా
మట్టిని తీసుకువచ్చి
పోస్తున్న టిప్పర్
అర్ధరాత్రి రిసార్ట్‌లకు తరలింపు
● నంబర్ ప్లేట్లు లేని టిప్పర్ల వినియోగం
● ఏడుపాయల టీ జంక్షన్ వద్ద తంతు
● పట్టించుకోని అధికారులు
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని పోతంశెట్టిపల్లి శివారు ఏడుపాయల వన దుర్గాదేవి సన్నిధికి వెళ్లే రహదారి పొడవున అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలు, వాటికోసం అవసరమైన మట్టిని తరలించేందుకు అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. తప్పుడు అనుమతుల పత్రాలతో, అర్ధరాత్రి మట్టి రవాణా చేయడం, అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్ఛగా అక్రమంగా మట్టి దందా చేస్తున్నారు. పైగా తాము ‘నాయకులమని‘, మమ్ములను ఎదిరించేవారు ఎవరంటూ.. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటనలు పరిపాటిగా తయారయ్యాయి. అధికారుల అడ్డగోలు అనుమతులతో ఈ దందా కొనసాగుతోందన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
20 ఎకరాల్లో రిసార్ట్‌కు...
ఎప్పుడూ నీటితో పారే మంజీరా నదికి పక్కన పచ్చని పంటల పొలాలతో తులతూగుతున్న భూములపై కన్నుపడ్డ కొందరు.. ఇక్కడి రైతులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి పొలాలను లీజుకు తీసుకుని రిసార్ట్‌లు, భవనాలను నిర్మిస్తు న్నారు. ఇప్పటికే ఇక్కడ అనుమతులు లేని నిర్మాణాలు వెలిశాయి. ఇందులో కొన్ని బఫర్ జోన్ పరిధిలో కూడా ఉన్నాయి. ముడుపులకు ఆశపడ్డ అధికారులు, అటువైపు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మరిన్ని నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం పెద్ద మొత్తంలో మట్టి అవసరం ఏర్పడటంతో అక్రమ మట్టి రవాణా దందా నడుస్తోంది. రింగుగా ఏర్పడ్డ కొందరు పెద్ద మొత్తంలో దందా నిర్వహిస్తున్నారు. తాజాగా 20 ఎకరాల పరిధిలో రిసార్ట్ నిర్మాణానికి ’నేను నాయకున్ని, నాకెవరు అడ్డు చెప్పేదని చెప్పుకుంటున్న ఓ అక్రమార్కుడు ఈ మట్టి రవాణాకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాపన్నపేట మండలం పరిధి నుంచి అర్ధరాత్రి తప్పుల తడకతో ఉన్న ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా మట్టిని టిప్పర్ల ద్వారా తీసుకెళ్తున్నారు. అనుమతి పత్రంలో చూపించినట్టుగా నంబర్ ప్లేటులేని టిప్పర్లను మట్టి రవాణాకు వినియోగించడం, పైగా అర్ధరాత్రి రవాణా చేస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో సర్కారు ఆదాయానికి సైతం గండి కొడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రిసార్ట్ ఏర్పాటు, అనుమతుల విషయమై పోతంశెట్టిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుంధతిని వివరణ కోరగా... ఎలాంటి అనుమతులు లేవని ఆమె సమాధానమిచ్చారు.
కేసులు నమోదు చేస్తాం
అర్ధరాత్రి మట్టి రవాణా చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా రవాణా చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌చారి, తహసీల్దార్, కొల్చారం

జోరుగా మట్టి దందా?

జోరుగా మట్టి దందా?