ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు

Aug 2 2025 7:18 AM | Updated on Aug 2 2025 7:18 AM

ఉపాధ్యాయ పోస్టులకు  దరఖాస్తులు

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు

బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల పీఓ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజికల్‌ స్టడీస్‌, సోషల్‌ సబ్జెక్ట్‌లను ఇంగ్లిష్‌ మీడియంలో బోధించే ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఈడీతోపాటు టెట్‌ అర్హత సాధించిన వారు అర్హులని, ఈనెల 5 లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పేకాట రాయుళ్ల అరెస్టు

గజ్వేల్‌రూరల్‌: పేకాట స్థావరంపై దాడిచేసి నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని పాత గ్రామపంచాయతీ సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లో కొందరు పేకాటాడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ. 28100 నగదుతో పాటు 4 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి..

చేగుంట(తూప్రాన్‌): గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ గోపాల్‌ వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు నాగులమ్మ కాలనీలో జార్ఖండ్‌కు చెందిన అస్మవుల్‌షేక్‌ గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడు ఉంటున్న ఇంటిని తనిఖీ చేసి 160 గ్రాముల గంజాయిని, నిందితుడి ఫోనును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని రామాయంపేట ఎస్‌హెచో కార్యాలయంలో అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ బాలయ్య, సిబ్బంది ఎల్లయ్య, చంద్రయ్య, రాజు, నరేశ్‌, హరీశ్‌, రవి, నవీన్‌ పాల్గొన్నారు.

కత్తితో బెదిరించిన వ్యక్తికి

మూడేళ్ల జైలు

రూ.వెయ్యి జరిమాన

మెదక్‌ మున్సిపాలిటీ: డబ్బులు దోచుకెళ్తూ కత్తితో బెదిరించిన వ్యక్తికి మూడేళ్ల జైలు, జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... 2024లో మెదక్‌ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శేకులు అనే వ్యక్తి నుంచి సిల్వేరి విల్సన్‌ డబ్బులు లాక్కొని వెళ్తుండగా బాధితుడు గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో అక్కడున్న భక్తులు పట్టుకునే ప్రయత్నం చేయగా విల్సన్‌ వారిని కత్తితో బెదిరించినట్లు తెలిపారు. ఈ మేరకు అప్పటి సీఐ కేసు నమోదు చేయగా శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ విల్సన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు విషయంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

మందుబాబులకు జరిమాన

సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 51మంది పట్టుబడ్డారు. వారిని శుక్రవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,04,500 జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement