
పార్టీలకు అతీతంగా నిధులిచ్చాం
సిద్దిపేటజోన్: పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సిద్దిపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు అప్పటి మంత్రి హరీశ్‌రావు సహకారంతో సమానంగా నిధులు కేటాయించామని బీఆర్‌ఎస్ పార్టీ సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు పేర్కొన్నారు. మేము ఇచ్చిందే కానీ, కాంగ్రెస్ వచ్చాక ఆ పార్టీ కౌన్సిలర్లు తెచ్చిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల కౌన్సిలర్లు చేసిన ఆరోపణలను బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఖండించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు కౌన్సిలర్లు ఏకపక్షంగా ఎజెండా రూపకల్పన చేసినట్టు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భార్యల పదవులను అడ్డం పెట్టుకుని భర్తలు రాజకీయం చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.20 కోట్ల మేర అభివృద్ధి పనుల నిధులను ఆపివేసిందని ఆరోపించారు. సిద్దిపేటకు ఆపిన నిధులను గూర్చి మంత్రులను అడిగే ధైర్యం లేని నాయకులు విమర్శలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్‌డీఎఫ్) కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న ఐదు వార్డులకు మాత్రమే ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. కలెక్టర్ స్పందించి అన్ని వార్డులకు ప్రభుత్వ నిధులు వచ్చేలా చూడాలన్నారు. అధికారం ఉందని, తమ వార్డులకు మాత్రమే నిధులను మంజూరు చేయడం సరికాదన్నారు. స్మార్ట్ సిటీ పథకం కింద ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్ని వార్డుల్లో అభివృద్ధి చేశారని, ప్రస్తుతం 90శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగతా 10 శాతం పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు లక్ష్మణ్, ప్రవీణ్, సుందర్, యోగి, నాగరాజురెడ్డి, మల్లికార్జున్, అరవింద్ రెడ్డి, సాయికుమార్,సతీశ్, కోఆప్షన్ సభ్యులు షాహిద్, సత్తయ్య, నాయకులు తిరుమల్ రెడ్డి, అక్తర్, మోహిజ్, రాజేశం, రాజు, శ్రీహరి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మీరేం తీసుకొచ్చారు?
రూ.20 కోట్ల నిధులు ఆపేసిన కాంగ్రెస్
ఆ పార్టీ నేతలవి
అవగాహనలేని వ్యాఖ్యలు
మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ధ్వజం