
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి..
కంది(సంగారెడ్డి): ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కౌలంపేటలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై రవీందర్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన జగన్మోహన్ (42) గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఊదం చెరువుకట్ట వద్దకు వెళ్లాడు. అక్కడే మద్యం తాగిన అతడు ప్రమాదవశాత్తు చెరువులోకి జారి పడ్డాడు. శుక్రవారం గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి కూలీ..
కంగ్టి(నారాయణఖేడ్): కూలీ పనికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తుర్కవడ్‌గాం గ్రామంలో చోటు చేసుకొంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కిందిదొడ్డి సోపాన్(37) గురువారం స్థానిక రైతు శెట్కార్ ఏశప్పకు చెందిన పత్తి చేనులో కిందిదొడ్డి శంకర్, తులసీరాంతో కలిసి రసాయనాల పిచికారీకి నీరు మోసేందుకు మద్యం తాగి వెళ్లాడు. సమీపంలోని బావిలో నుంచి నీరు మోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. కాగా గమనించిన తోటి కూలీలు బావిలోని నీటిని మోటారు సాయంతో బయటకు తోడగా శుక్రవారం ఉదయం బావిలో మృతదేహం లభించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సిద్ధ దుర్గారెడ్డి తెలిపారు.
అనారోగ్యంతో బీహార్ వాసి..
పటాన్‌చెరు టౌన్: పడుకున్న చోటే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... బీహార్‌కి చెందిన మురళి కుమార్ (32) బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారంలో ఉంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో పడుకున్న అతడు శుక్రవారం ఉదయం నిద్రలేవలేదు. దీంతో తోటి కార్మికులు, స్థానికులు మురళిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బైక్‌పైనుంచి కిందపడి..
కౌడిపల్లి(నర్సాపూర్): బైక్ అదుపుతప్పి కిందపడటంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన మేకలకాడి నాగరాజు(37) గురువారం సాయంత్రం కౌడిపల్లిలో అంగడికి వెల్లి కూరగాయలు తీసుకువస్తానని ఇంట్లో చెప్పి తన బైక్‌పై వెళ్లాడు. రాత్రి తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతుండగా మండలంలోని ధర్మసాగర్ శివారులో రోడ్డుపై బైక్ అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.