
రోడ్డు దాటుతుండగా కారు ఢీ..
వ్యక్తి దుర్మరణం
సదాశివపేట(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే దుర్మణం చెందాడు. ఈ ఘటన 65వ నంబర్ జాతీయ రహదారి మద్దికుంట చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశం కథనం ప్రకారం... పట్టణ పరిధిలోని దక్కన్‌దాబా వద్ద మద్దికుంట వెళ్లడానికి కల్లప్ప(43)అనే వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఇదే సమయంలో సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న మారుతి వేగనార్ డ్రైవర్ అతివేగంగా నడిపి ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కల్లప్ప కర్నాటకలోని బీదర్ జిల్లా పర్వాటి మండలం బెల్హల్లీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడు స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
హవేళిఘణాపూర్(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మెదక్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన యాదాగౌడ్ కుమారుడు శివకుమార్‌గౌడ్(20) పదవ తరగతి వరకు చదువుకుని నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి మేడ్చల్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మేడ్చల్‌లోని తన రూమ్‌కు తిరిగి వస్తుండగా ఈ నెల 18న బొలెరో వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.