
మంత్రి వివేక్ వ్యాఖ్యలు సరికాదు
బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ
సిద్దిపేటజోన్: జిల్లాపై అవగాహన లేక, అక్కసుతో మంత్రి వివేక్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఆయన తండ్రి వెంకట్ స్వామిని ఎంపీగా చేయడంలో సిద్దిపేట ప్రజల పాత్ర ఉందన్నారు. దాన్ని మరిచి మంత్రి సిద్దిపేటపై అక్కసు, అసూయతో వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు సహించరని స్పష్టం చేశారు. సిద్దిపేటను చెన్నూరుతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిద్దిపేట వెయ్యి పడకల ఆస్పత్రి అవసరమా అని వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. చెన్నూరుకు వెయ్యి పడకల ఆస్పత్రి మంజూరు చేయకపోవడం ఆయన అసమర్థతగా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయాంలో జిల్లాలో 11673 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేశారని, అది తెలియక ఇండ్లు రాలేదని అనడం అసత్య ప్రచారమన్నారు. జిల్లాలో రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు భుపేశ్, శ్రీనివాస్, మోహన్ లాల్, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, కనకరాజు, సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ వైస్ పాపయ్య పాల్గొన్నారు.