
పంట పురుగులకు దీపం ఎరతో చెక్
వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్‌నారాయణ
రామాయంపేట(మెదక్): దీపం ఎరలతో వరి, మొక్కజొన్న, పత్తి చేన్లలో కాండం తొలిచే పురుగు ఉధృతని అరికట్టవచ్చని వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్‌నారాయణ పేర్కొన్నారు. దీపపు ఎరల వినియోగంపై బుధవారం మండలంలోని లక్ష్మాపూర్‌లో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వీటి నివారణకుగాను తరచూ పురుగుల మందులను పిచికారీ చేస్తే వాటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఇలా చాలాసార్లు మరిన్ని శక్తివంతమైన మందులు పిచికారీ చేయాల్సి ఉంటుందని, దీంతో పంట ఉత్పత్తి తగ్గడంతోపాటు రైతులకు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. కాండం తొలిచే పురుగు నివారణకు సాయంత్రం వేళ పంటచేన్లలో దీపపు కాంతి ఎరలను అమర్చడం ద్వారా వాటిని ఆకర్షించి చంపివేయడమే ఏకై క మార్గమన్నారు. దీపం ఎర తయారీకి రైతుకు కేవలం రూ.మూడు నుంచి నాలుగు వందలు మాత్రమే ఖర్చవుతాయని తెలిపారు.