
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ పరితోష్ పంకజ్
జోగిపేట /వట్‌పల్లి (అందోల్): బెట్టింగ్, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసులకు సూచించారు. ప్రజలు కూడా ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళవారం జోగిపేట, వట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్‌లో ఉండాలని, ప్రతి ఫిర్యాదును క్లుప్తంగా విచారణ చేపట్టాలన్నారు. డయల్ 100 కాల్స్‌కు త్వరితగతిన స్పందించాలని, త్వరగా ఘటనా స్థలానికి చేరుకున్నట్లయితే నేరం తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నారు. నేరాల నియంత్రణ, జరిగిన నేరాలను ఛేదించడానికి ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని తెలిపారు. డాబాలు, పెట్రోల్ పంపులు, విద్యాసంస్థల్లో సీసీలు ఏర్పాటు చేసుకునేలా యాజమాన్యాలకు అవగాహన కల్పించారు.