
హత్య కేసులో నిందితుడికి రిమాండ్
● నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు ● సిబ్బందిని అభినందించిన జిన్నారం సీఐ నయీముద్దీన్
హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీను (25) హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కాసాల గ్రామ శివారులోని ఇప్పలకుంట సమీపంలో ఓ గుర్తుతెలియని కాలిపోయిన మృతదేహాన్ని ఈనెల 25న పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని కాసాల గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీనుగా గుర్తించారు. హత్యకు గురైన శ్రీను అతని బంధువైన దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ఎరుకలి మల్లేశం కంపెనీలో పనిచేసేవాడు. గతంలో వీరిద్దరూ దొంగతనం కేసులో నేరస్తులుగా ఉండటంతోపాటు ఇతర తగాదాల్లో కూడా ప్రమేయం ఉంది. ఒక విషయంలో వీరిద్దరి మధ్యా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈనెల 25న వీరిద్దరికీ కోర్టులో కేసు ఉండటంతో శ్రీను ఈనెల 24న బీరంగూడ నుంచి దౌల్తాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మద్యం తాగుతున్న సమయంలో పథకం ప్రకారం మల్లేశం వెంటతెచ్చుకున్న బ్లేడుతో శ్రీనుపైదాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శ్రీను మృతదేహాన్ని మల్లేశం గ్రామశివారులోని ఇప్పలగుంట సమీపంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో మల్లేశంను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. త్వరితగతిన హత్య కేసును ఛేదించిన హత్నూర పోలీస్ సిబ్బందిని సీఐ నయీముద్దీన్ అభినందించారు.