ఎరువుల వినియోగం తగ్గించాలి
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం
జిన్నారం (పటాన్‌చెరు): యూరియా వాడకం తగ్గించడం వల్ల సాగు ఖర్చు తగ్గించుకోవచ్చని అలాగే రసాయనాలు, ఎరువులను తగ్గించడం వల్ల నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సుమాలిని, కాంగ్రెస్ నేత రాములు నాయక్ పేర్కొన్నారు. గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు సలహాలను అందించారు. విత్తినప్పటి నుంచి పంట కోసే వరకు విత్తనాలకు సంబంధించి రశీదులు భద్రపరుచుకోవాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి మేలైన వంగడాల గురించి వివరించారు. నత్తనయ్యపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శోభా మాట్లాడుతూ... చిరుధాన్యాలు సాగు చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పచ్చిరొట్టె ఎరువుల పంటలైన జనుము, జీలుగ ఆవశ్యకతను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, వైస్ చైర్మన్ దయాకర్‌రెడ్డి, డైరెక్టర్ జయశంకర్ గౌడ్, దయాకర్‌రెడ్డి, వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నల్లవల్లిలో....
గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు హేమలత జానకి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు పంటల సాగు పద్ధతుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ ప్రణవి, వ్యవసాయ విద్యార్థులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


