
చివరి గింజవరకూ కొంటాం
నారాయణఖేడ్: రైతుల మేలుకోసమే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని, చివరి గింజవరకూ ధాన్యాన్ని కొంటామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నిజాంపేట్ మండలం జంబికుంట గ్రామంలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...గత ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. తమ ప్రభుత్వం రైతులకు పనిముట్లు, విత్తనాలు సైతం అందజేస్తామని తెలిపారు. ధరణి పోర్టల్‌తో ఇన్నాళ్లూ రైతులు పడ్డ కష్టాలు భూ భారతితో తొలగిపోయాయని వివరించారు. భూ భారతి ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని వెల్లడించారు.
అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట
ఖేడ్ మండలం నమ్లిమెట్ గ్రామంలో దుర్గాభవానీమాత ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామపెద్దలు వారిని శాలువాతో సన్మానించారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
ఖేడ్ మున్సిపాలిటీలో నీటి సరాఫరా విభాగం సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న జన్వాడె బస్వరాజ్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆదివారం ఆయన స్వగ్రామమైన సిర్గాపూర్ మండలం చిన్నముబారక్ పూర్ గ్రామానికి సంజీవరెడ్డి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడీవో సంగ్రాం, కాంగ్రెస్ నాయకులు అంతన్నగారి మల్లేశం, రాధాకిషన్, నాయకులు యాదవరెడ్డి, అశోక్‌పాటిల్, పండరిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి