విద్యార్థి అదృశ్యం

తీవ్రంగా గాయపడిన నరేశ్‌గౌడ్‌  - Sakshi

కంది(సంగారెడ్డి): పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యమయ్యాడు. రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం..కందిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో కోహిర్‌ మండలం కవేలి గ్రామానికి చెందిన మహమ్మద్‌ సౌద్‌ ఇబ్రహీం పదోతరగతి చదువుతున్నాడు. ఈనెల 27వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. ఇబ్రహీం కోసం చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ప్రిన్సిపాల్‌ ఉషశ్రీ మంగవాళం ఫిర్యాదు చే యగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోక్సో కేసులో మూడేళ్ల జైలు

కొండపాక(గజ్వేల్‌): పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో పొర్ల జయరాములుకు మూడేళ్ల జైలు, రూ. 3వేలు జరిమానా విధిస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి భవాని తీర్పు చెప్పారని కుకునూరుపల్లి ఎస్‌ఐ పుష్పరాజ్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గిరాయిపల్లికి చెందిన పొర్ల జయరాములు ప్రేమపేరుతో ఓ మైనర్‌ వెంటపడడంతో 2019లో కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి ఎస్‌ఐ పరమేశ్వర్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి పైవిధంగా తీర్పు ఇచ్చారు.

ఒకదాని వెనుక మరోటి

లారీ, బస్సు, కారు ఢీ..తప్పిన ప్రమాదం

మనోహరాబాద్‌(తూప్రాన్‌): హైదరాబాద్‌ వైపు వెళుతున్న లారీని ఎక్స్‌ప్రెస్‌ బస్సు, కారు ఒకదానికి ఒకటి ఢీకొన్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ నుంచి ప్రయాణికులతో గరుడా ఎక్స్‌ప్రెస్‌ బస్సు హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో మండలపరిధిలోని కాళ్ళకల్‌ గ్రామ శివారులోకి రాగానే జాతీయ రహదారిపై స్టీల్‌ లోడ్‌తో వెళుతున్న లారీ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో వెనుక వస్తున్న బస్సు దానిని ఢీకొట్టింది. అదే వరుసలో ఉన్న కారు సైతం బస్సును ఢీ కొట్టింది. పలువురికి చిన్న చిన్న గాయాలయ్యాయి. ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.

వైద్యం కోసం వెళితే...

వెల్దుర్తి(తూప్రాన్‌): అనారోగ్యంతో చికిత్సకు వెళ్లిన ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఎస్‌ఐ మదుసూధన్‌గౌడ్‌, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలపరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన నరేశ్‌గౌడ్‌ వైద్యం కోసం సోమవారం రాత్రి వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రి నిర్వాహకుడైన ఆర్‌ఎంపీ సకాలంలో స్పందించలేదు సరికదా అతని కుమారుడు అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన యువకుడిపై కర్రతో దాడిచేశాడు. దీంతో నరేశ్‌ తలపై తీవ్రగాయాలై రక్తంతో దుస్తులు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, అతడు కోమాలోకి వెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

అదృశ్యమై.. ఆపై శవమై

పాపన్నపేట(మెదక్‌): ఐదురోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు శవమై కనిపించాడు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం..మండల పరిధిలోని దుమ్లాతండాకు చెందిన ధరావత్‌ శ్రీకాంత్‌(24) ఈనెల 23వతేదీన అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు వెతికినా, ఆచూకీ లభ్యం కాలేదు. తమ్మాయిపల్లి శివారులో శవమై కనిపించాడు. అయితే ఫిట్స్‌తో చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top