తహసీల్దార్ కార్యాలయం వద్ద కబ్జా రైతుల ఆందోళన
● లీగల్ హెయిర్ సర్టిఫికెట్తో 24.35 ఎకరాలు కొల్లగొట్టే యత్నం జరుగుతోందని బాధితుల ఆరోపణ
● న్యాయం చేయాలని డిమాండ్
కందుకూరు: వారసులందరినీ పక్కనబెట్టి, తానే వారసురాలని చెప్పుకొని లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పొందిన ఓ మహిళ 24.35 ఎకరాల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై బుధవారం తహసీల్దార్ను నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాచుపల్లి పంచాయతీ పరిధి పెరుగుగూడ రెవెన్యూలోని 1, 2 సర్వే నంబర్లలో 24.35 ఎకరాల భూమి 1954లో సయ్యద్ మొయినుద్దీన్ పేరుతో పట్టాగా రికార్డు అయి ఉంది. ఇదే గ్రామానికి చెందిన ఆగయ్య, పోచయ్య కుటుంబం అప్పటి నుంచి ఆ భూమిని అనుభవిస్తూ పీటీదారులుగా ఉన్నారు. రికార్డుల్లో మాత్రం ఆగయ్య వగైరా అని నమోదైంది. కాలక్రమంలో ఆ ఇరువురి కుటుంబీకుల పేరుతోనే పట్టాగా నమోదైంది. అయితే పోచయ్య సొంత మనవరాలు బాలనర్సమ్మ తానే ఆ భూమి మొత్తానికి వారసురాలినని 2006లో రెవెన్యూ కార్యాలయంలో పీటీ రికార్డులో ఉన్న ఆగయ్య వారసురాలిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పాటు కోర్టు ద్వారా లీగర్ హెయిర్ సర్టిఫికెట్ పొందింది. దీనిద్వారా ఆర్డీఓలో 2022లో 38ఈ సర్టిఫికెట్ తీసుకుంది. కబ్జాలో ఉన్న రైతులకు విషయం తెలియడంతో అప్పటి నుంచి జేసీ కోర్టులో పోరాటం చేస్తున్నారు. అంతకుముందు అసలు పట్టాదారు వారసులు గతంలో ఆ భూమిని వేరే వారికి విక్రయించగా కోర్టులో ప్రస్తుతం భూమిపై కబ్జాలో ఉన్న వారి మధ్య మరో కేసు నడుస్తూనే ఉంది. ఆ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరపకుండా నిషేధిత జాబితాలో కూడా పెట్టారు.
డీఎస్ పెండింగ్
కాగా 38ఈ సర్టిఫికెట్ పొందిన బాలనర్సమ్మ ఈ నెల 6న భూభారతిలో తన పేరుతో పట్టాదారుగా నమోదు చేయించుకుంది. 9న వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నంలో ఫొటోలు దిగారు, సర్వర్ డౌన్ లేదా ఇతర కారణాలతో డిజిటల్ సైన్ పెండింగ్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన రైతులు రికార్డులు చూసుకోగా తమ పేర్లు గల్లంతై బాలనర్సమ్మ పేరు నమోదై ఉండటంతో అవాక్కయ్యారు. ఇటీవల వరకు రికార్డుల్లో ఉన్న భూమి ఇప్పుడు కనిపించకపోవడంతో పాటు మరొకరికి విక్రయించే ప్రయత్నాన్ని తెలుసుకుని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బాలనర్సమ్మ పేరుతో ఏవిధంగా పట్టా చేశారని నిలదీశారు. కోర్టులో కేసు నడుస్తున్నా ఏకపక్షంగా రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. వెంటనే ఆమె పేరును రికార్డుల నుంచి తొలగించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరిలో ఓ మహిళ పెట్రోల్ బాటిల్ సైతం తెచ్చుకోవడాన్ని చూసిన పోలీసులు ఆమె దగ్గర నుంచి లాక్కున్నారు. కాగా 38ఈ సర్టిఫికెట్ ఆధారంగా రికార్డులు మార్చామని తహసీల్దార్ గోపాల్ వారికి వివరించారు. సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తానని హామీ ఇచ్చారు. రైతులకు మద్దతుగా గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు వచ్చారు.
కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ను నిలదీస్తున్న బాధిత రైతులు, ప్రజాప్రతినిధులు
కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళనకు దిగిన బాధిత రైతులు


