సీఎం.. నా మేనమామే! | - | Sakshi
Sakshi News home page

సీఎం.. నా మేనమామే!

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

ఏసీబీకి చిక్కిన పలువురు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘సీఎం నా మేనమామ.. చాలా దగ్గరి బంధువు.. నేనేం చేసినా నన్నెవరూ ఏమీ చేయలేరు’ అంటూ తోటి తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజల ముందు విర్రవీగారు. చివరికి ఏసీబీకి అడ్డంగా దొరికి చంచల్‌గూడజైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఆయనే అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి. కందుకూరు మండలం జైత్వారం ఆయన సొంతూరు. తండ్రి విధినిర్వహణలో చనిపోవడంతో కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం వచ్చింది.

ఏడాది క్రితమే బాధ్యతలు

రెవెన్యూ విభాగంలో అడుగుపెట్టారు. హయత్‌నగర్‌ మండలంలో వీఆర్‌ఓగా, ఆర్‌ఐగా, జూనియర్‌ అసిస్టెంట్‌గా, కందుకూరు మండల డిప్యూటీ తహసీల్దార్‌గా, కందుకూరు ఆర్‌డీఓ ఆఫీసులో డీటీగా, చేవెళ్ల ఆర్‌డీఓ ఆఫీసులో ఏఓగా, కలెక్టరేట్‌లో సెక్షన్‌ ఇన్‌చార్జీగా పని చేశారు. 2024 ఆగస్టుల్లో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే ఇక్కడ వీఆర్‌ఓ, ఆర్‌ఐగా పని చేసిన అనుభవం ఉండడం, భూములపై పూర్తి అవగాహన కలిగి ఉండడం కలిసి వచ్చింది.

అప్పట్లోనే భారీగా ముడుపులు

ఏడాది క్రితం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పసుమాముల రెవెన్యూ సర్వే నంబర్‌ 137లోని 9.34 ఎకరాలు, సర్వే నంబర్‌ 175లోని ఆరు గుంటల భూమి (మొత్తం పది ఎకరాలు) కొండలు, గుట్టలతో ఔటర్‌కు ఆనుకుని ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. అప్పట్లో కొంతమంది స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించింది. ఎన్‌ఓసీ పొంది కొనుగోలు చేసిన రియల్టర్లు ఏడాది క్రితం నాలా కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే ఈ భూములపై పూర్తి అవగాహన ఉన్న సుదర్శన్‌రెడ్డి పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేశారు. చేసేది లేక సదరు రియల్టర్లు ఆయన అడిగినంత ముట్టజెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇంజనీర్లు ముందే సంతకాలు

తర్వాత ఆ భూమిలో వెంచర్‌ కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేశారు. ఇరిగేషన్‌, రెవెన్యూ, సర్వే అధికారుల జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసి ఎన్‌ఓసీ జారీ చేయాల్సి ఉంది. నిజానికి రెవెన్యూ అధికారులు భూమి సరిహద్దులు, స్వభావం గుర్తించి నివేదిక ఇచ్చిన తర్వాతే ఇరిగేషన్‌ అధికారులు ఎన్‌ఓసీ జారీ చేయాలి. కానీ ఇటీవలే ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన ఓ ఇరిగేషన్‌ ఇంజనీరు సైతం పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకుని రెవెన్యూ కంటే ముందే ఎన్‌ఓసీపై సంతకం చేసినట్లు తెలిసింది.

మూడు నెలల క్రితమే వచ్చి..

సర్వేయర్‌ శ్రీనివాస్‌ మూడు నెలల క్రితం నల్లగొండ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. వచ్చీరావడంతోనే చేతివాటాన్ని ప్రదర్శించారు. ముడుపులు ముట్టజెప్పిన వారికి ఒకలా.. నిరాకరించిన వారికి మరోలా సర్వే నివేదికలు ఇచ్చేవారు. చివరికి తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణను ఏసీబీ సేకరించింది. ఈ వ్యవహారంలో ఓ స్థానిక విలేకరి ప్రమేయంపై పిలిచి విచారించినట్లు సమాచారం.

సంచలనాలకు కేంద్రం

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతోంది. బాచారం భూమికి సంబంధించిన వివాదంలో 2019 నవంబర్‌ 4న విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనను స్థానికులు ఇంకా పూర్తిగా మరిచిపోలేదు. రెవెన్యూ అధికారుల్లో మార్పు రాలేదని చెప్పడానికి తాజా ఏసీబీ కేసుల ఉదంతమే ఉదాహరణ. ప్రభుత్వ, భూదాన్‌, అసైన్డ్‌ భూములు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మెజార్టీ భూ భాగం కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. ఇక్కడ భూ ఆక్రమణలు, వివాదాలు తరచూ వెలుగు చూస్తుంటాయి.

సీఎం సిఫార్సుతో వచ్చి..

ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌ఓ

వికారాబాద్‌ డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్‌ స్వర్ణకుమారి సీఎం సిఫార్సుతో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా వచ్చారు. అప్పటికే ఉన్న డాక్టర్‌ లలితా దేవిని మరో చోటికి బదిలీ చేయించారు. ఆరు నెలలు తిరక్కముందే ఎల్బీనగర్‌లోని ఓ ఫిజియో థెరపీ సెంటర్‌ రీ ఓపెన్‌ కోసం తన డ్రైవర్‌, సూపర్‌ వైజర్‌ల ద్వారా రూ.లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. గతంలో ఆమె ఇదే జైల్లోని రోగులకు వైద్య సేవలు అందించడం గమనార్హం.

సొంత బంధువుగా చెప్పుకొంటూ

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ హల్‌చల్‌

డీటీ నుంచి పదోన్నతి పొందిన తర్వాత ఇదే తొలి పోస్టింగ్‌

వచ్చిన వెంటనే అక్రమార్జనకు తెగబడిన సుదర్శన్‌రెడ్డి

నాలా కన్వర్షన్‌ పేరుతో ఏడాది క్రితమే భారీగా వసూలు

రెవెన్యూ క్లియరెన్స్‌ ఇవ్వక ముందే ఇరిగేషన్‌ క్లియరెన్స్‌లు

తాజాగా జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే కోసం రూ.50 లక్షలు డిమాండ్‌

రూ.30 లక్షలకు ఒప్పందం.. చివరకు రూ.20 లక్షలతో చిక్కిన వైనం

జిల్లా సర్వే లాండ్స్‌ ఏడీ శ్రీనివాసులు సహా గతంలో యాచారం తహసీల్దార్‌గా పని చేసిన సుచరిత, శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్‌ చేసింది. సేవలకు ప్రతిఫలంగా బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటూ పలువురు అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడారు. వీరిలో అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్‌ ఆఫీసు ఏఓ శ్రీనివాసరెడ్డి, ఆమనగల్లు తహసీల్దార్‌ లలిత సహా సర్వేయర్‌ రవిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేశంపేట తహసీల్దార్‌ లావణ్య సహా వీఆర్‌ఓ అనంతయ్యను ఏసీబీ అరెస్ట్‌ చేసింది. తలకొండపల్లి తహసీల్దార్‌ నాగార్జున, వీఆర్‌ఏ యాదగిరి సైతం ఇదే కేసులో అరెస్ట్‌ అయ్యారు. గండిపేట మండల సర్వేయర్‌ గణేశ్‌, ఇరిగేషన్‌ ఈఈ బన్సీలాల్‌, ఏఈ కార్తిక్‌, సెక్షన్‌ ఏఈ నిఖేష్‌కుమార్‌ అరెస్ట్‌ అయ్యారు. తాజాగా మరికొంత మంది తహసీల్దార్లు, సర్వేయర్లపై ఏసీబీ దృష్టిపెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement