యాచారం: భూసేకరణ అంటేనే రైతుల గుండెల్లో దడ పుడుతోంది. ఎప్పుడు.. ఏ రోజు.. ఏ గ్రామానికి నోటిఫికేషన్ వస్తుందోనన్న భయం పట్టుకుంది. ఫార్మాసిటీ పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని 9 వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను సేకరించడం తెలిసిందే. అదే భూముల్లో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తోంది. ఫార్మాసిటీ భూసేకరణ సమయంలోనే రైతులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అప్పటి సర్కార్ వెనుకంజ వేయలేదు. అదే తరహాలో ప్రస్తుతం ప్రభుత్వం కూడా భూసేకరణ ప్రక్రియపై దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏడాది క్రితం మొండిగౌరెల్లిలోని 822 ఎకరాలు, రెండు నెలల క్రితం కొత్తపల్లిలోని 950 ఎకరాల అసైన్డ్, పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొండిగౌరెల్లిలోని అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.30 లక్షల పరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల ప్లాట్లు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. కొత్తపల్లిలోని అసైన్డ్ భూములకు చెల్లించే పరిహారంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
మరో 2,500 ఎకరాల సేకరణకు సిద్ధం
యాచారం మండలంలోని నందివనపర్తి, నస్ధిక్సింగారం, కొత్తపల్లి, చింతపట్ల తదితర గ్రామాల్లోని మరో 2,500 ఎకరాల భూసేకరణకు సర్కార్ దృష్టి పెట్టింది. ఆయా గ్రామాల్లోని దేవాలయ, అసైన్డ్ భూముల సేకరణపై గెజిట్ కూడా విడుదల చేసింది. త్వరలో చింతపట్ల, చింతుల్ల, మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి, యాచారం గ్రామాల్లోని అసైన్డ్ భూముల సేకరణ ముందుకు వెళ్లడానికి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని 50 ఎకరాలకు పైగా అసైన్డ్ సర్వేనంబర్లను గుర్తించింది. మూడు నెలల క్రితం 50 ఎకరాల నుంచి 200 ఎకరాలకు పైగా ఉన్న అసైన్డ్ సర్వేనంబర్ల జాబితాను స్థానిక అధికారులు నివేదిక పంపారు. అసైన్డ్ భూముల బదిలీలు, మ్యూటేషన్లు, విరాసత్‌లు చేయకుండా అసైన్డ్ సర్వే నంబర్లను మొత్తం 22 ఏలో పొందుపర్చారు.
ఫ్యూచర్‌కు అత్యధికంగా ఇక్కడి నుంచే..
కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్‌సిటీకి యాచారం మండలం నుంచి భూసేకరణకు జరపాలిని నిర్ణయించింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ మండలంలో అత్యధిక అసైన్డ్ భూములు ఉండడం, పైగా హానగరానికి దగ్గరలో, ప్రస్తుతం భారత్ ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తున్న సమీపంలోనే ఉండడం కలిసివస్తోంది. భవిష్యత్తులో భూ బ్యాంకు కావాల్సి వచ్చినప్పుడు ఆయా గ్రామాల్లో దాదాపు 5 నుంచి పది వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను సేకరించే యోచనలో సర్కార్ ఉంది. చెల్లింపులో సైతం రైతుల నుంచి ఒత్తిళ్లు రాకపోవచ్చని భావన నెలకొంది. ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తున్న నేపథ్యంలో భూములకు రూ.కోట్లలో ఉండడంతో పట్టా భూముల సేకరణ అంశాన్ని సడలించే అవకాశం ఉంటుందని ఎఫ్‌సీడీఏ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
ఎప్పుడు ఏ గ్రామంలో నోటిఫికేషన్లు వస్తాయో..
ఫ్యూచర్‌సిటీ కోసం 50 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములున్న సర్వే నంబర్లు గుర్తింపు
యాచారం మండలంపైనే దృష్టి
రైతుల్లో మొదలైన ఆందోళన


